Doda bus falls into gorge : దోడాలో లోయలో పడిన బస్సు.. 36 మంది మృతి.. ప్రధాని మోడీ సంతాపం..
Doda bus accident : జమ్మూ కాశ్మీర్ లో బస్సు లోయలో పడిన ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 36కి చేరుకుంది. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.
Doda bus accident : జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో బస్సు అదుపుతప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది ప్రయాణికులు మరణించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బటోటే-కిష్త్వార్ జాతీయ రహదారిపై తుంగల్-అస్సార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
ఈ ఘటనపై సమచాారం అందిన వెంటనే స్థానికులు, పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వేగంగా సహాయక చర్యల్గొ పాల్గొంటున్నారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. ఈప్రమాదంపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘‘దోడా ప్రమాదంలో దురదృష్టవశాత్తు 36 మంది మరణించారు. 19 మంది గాయపడ్డారని, వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దోడా, కిష్త్వార్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వారిని తరలించేందుకు హెలికాప్టర్ సేవలను ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం’’ అని ఆయన వెల్లడించారు.
కాగా.. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ‘‘జమ్మూకాశ్మీర్ లోని దోడాలో జరిగిన బస్సు ప్రమాదం బాధాకరం. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో పోస్టు పెట్టింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని, క్షతగాత్రులకు రూ.50 వేల సాయం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని పీఎంవో పేర్కొంది.
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘దోడాలోని అస్సార్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని డివ్ కామ్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మిన్ ను ఆదేశించాం’’ అని ఆయన పేర్కొన్నారు.