ఆమె పొత్తికడుపు పై భాగంలో బాగా వాపు వచ్చింది. అయితే ఆమె సమస్యను అల్ట్రాసౌండ్, ఎక్స్-రే లేదా సిటి స్కాన్ ద్వారా గుర్తించలేము. కాబట్టి, ఎండోస్కోపీ చేశాం. అది చూసి మేము షాక్ అయ్యాం. ఆమె కడుపులో పెద్ద ట్రైకోబెజోవర్ ఉంది"అని ఆయన అన్నారు.
లక్నో : లక్నోలోని ఓ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. లక్నోలోని బలరాంపూర్ ఆసుపత్రిలో 17 ఏళ్ల బాలిక కడుపు నుండి దాదాపు 2 కిలోల బరువున్న జుట్టును వైద్యులు తొలగించారు.
ఆపరేషన్ చేసిన గ్యాస్ట్రో-సర్జన్ డాక్టర్ ఎస్ఆర్ సమద్దర్ మాట్లాడుతూ, బాలిక ట్రైకోబెజోవర్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుందని అన్నారు. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే రోగులు తమ జుట్టును తామే పీక్కుని తినేస్తుంటారు. ఇంకా ఆయన ఇలా మాట్లాడుతూ "10 రోజుల క్రితం, ఈ అమ్మాయి మా ఆసుపత్రికి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు వాంతులు, కడుపు నొప్పి తీవ్రంగా ఉంది’ అని చెప్పింది.
ఆమె పొత్తికడుపు పై భాగంలో బాగా వాపు వచ్చింది. అయితే ఆమె సమస్యను అల్ట్రాసౌండ్, ఎక్స్-రే లేదా సిటి స్కాన్ ద్వారా గుర్తించలేము. కాబట్టి, ఎండోస్కోపీ చేశాం. అది చూసి మేము షాక్ అయ్యాం. ఆమె కడుపులో పెద్ద ట్రైకోబెజోవర్ ఉంది"అని ఆయన అన్నారు.
వెంటనే ఆపరేషన్ కు సిద్దం చేసిన డాక్టర్ సమద్దర్.. తనతో పాటు వైద్యుల బృందంతో కలిసి గురువారం బాలికకు శస్త్రచికిత్స చేశారు. ఆమె కడుపులో నుండి 20 సెంటీమీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల వెడల్పు గల 2 కేజీల బరువున్న జుట్టును బయటికి తీశారు. ఆ వెంట్రుకల ముద్ద ఆ అమ్మాయి కడుపులో రాతి బంతిలా తయారయ్యింది.
"ఇలా వెంట్రుకలు గడ్డలా ఏర్పడడం వల్ల.. తిన్న ఆహారం కడుపులో నిలవదు. అది చిన్న ప్రేగులోకి వెళ్ళదు. అందుకే, అమ్మాయి బలహీనంగా ఉంది. ఆమె 17 సంవత్సరాలున్నా.. బరువు మాత్రం 32 కిలోలు మాత్రమే ఉంది. ఇప్పుడామెకు ఆపరేషన్ చేశాం. ఆమె త్వరలోనే కోలుకుంటుంది. నాలుగైదు రోజుల్లో మామూలుగా తినగలుగుతుంది"అన్నారాయన.
ఇలా జుట్టు ఎందుకు తింటారు. ఈ వింత అలవాటుకి కారణమేమిటని అడిగితే.. డాక్టర్ సమద్దర్ ఈ వ్యాధి సాధారణంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న రోగులలో కనిపిస్తుందని చెప్పారు. అంతేకాదు "ఇది మానసిక సమస్య. దీనితో బాధపడుతున్న వాళ్లు తమ జుట్టును తామే పీక్కుని..ఇతరులు చూడకుండా చాటుగా తింటారు. ఈ అమ్మాయి కోలుకున్న తరువాత తనను మా ఆసుపత్రిలోని సైకియాట్రిక్ డిపార్ట్ మెంట్ కు రిఫర్ చేస్తాం. అక్కడ ఆమెకు కౌన్సెలింగ్ దొరుకుతుంది" అని అన్నారు.
"ఆమెకు సైకో థెరపీతో పాటు, సోషల్ థెరపీ కూడా ఇస్తాం. అయితే కొద్ది రోజుల పాటు ఆమె తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలి," అన్నారాయన. ఈ సమస్య నుంచి తన కూతురిని బయటపడేసినందుకు అమ్మాయి తల్లిదండ్రులు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో గుర్తించి ఆపరేషన్ తో తమ కూతురికి నయం చేశారని చెప్పుకొచ్చారు.
"ఆమె రెండు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో ఇక లాభం లేదని మేము ఆమెను ఇక్కడికి తీసుకువచ్చాం. ఆమెకు జుట్టు తినే అలవాటు ఉందని మాకు తెలియదు. ఆమె ఇంట్లో మామూలుగానే ఉండేది" అని అమ్మాయి తండ్రి చెప్పారు. "ఆమె సమస్య సరైన సమయంలో నిర్ధారణ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తను ఇప్పుడు బాగానే ఉంది" అని అమ్మాయి తల్లి చెప్పింది.
దీనిమీద బలరాంపూర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, అమ్మాయి డిప్రెషన్‌కు సంబంధించిన కొన్ని సమస్యలతో బాధపడుతుందని, మానసిక చికిత్స ద్వారా మాత్రమే పూర్తి చికిత్స చేయవచ్చని చెప్పారు.
