ఢిల్లీకి చెందిన ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ వివేక్ రాయ్ ఆత్మహత్య చేసుకోవడం విషాదం నెలకొంది. దేశంలో కరోనా మహమ్మారి నుంచి లక్షలాది మంది ప్రాణాల్ని కాపాడుతున్న డాక్టర్స్ రకరకాల కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం కరోనా సోకడం వల్లే సుమారు 800 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 

అయితే ఇటీవల భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో ప్రాణాలను తెగించి కరోనా బాధితులకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్లు మనోవేదనకు గురవుతున్నారు. తాము ట్రీట్మెంట్ ఇచ్చిన బాధితులు కళ్లముందు ప్రాణాలు కోల్పోతుంటే అసహాయులై కృంగిపోతున్నారు. మరికొందరు సున్నిత మనస్కులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. 

తాజాగా ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ కు చెందిన డాక్టర్ వివేక్ రాయ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్థారించారు. గోరఖ్ పూర్ కు చెందిన వివేక్ రాయ్ ఢిల్లీలోని మాళవీయనగర్ లో నివాసం ఉంటూ సౌంత్ ఢిల్లీకి చెందిన మ్యాక్స్ ఆస్పత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. 

గత కొద్దిరోజులుగా మ్యాక్స్ ఆస్పత్రి ఐసీయూలో కరోనా బాధితులకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వివేక్ రాయ్ మనో వేదనకు గురైనట్లు తోటి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 

పెళ్లికి వెళ్లొచ్చారు.. 70 మందికి కరోనా అంటించారు.. !!...

ఎప్పటిలాగా ఆస్పత్రిలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన, వివేక్ రాయ్ తన బెడ్ రూమ్ లో చీరతో సీలింగ్ ప్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న వివేక్ ఎంతకీ ఇంటి డోర్ ఓపెన్ చేయకపోవడంతో కుటుంబసభ్యులు శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మాళవీయ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వివేక్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సౌత్ డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ.. వివేక్ రాయ్ కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో అతని ఇంటికి వెళ్లాం. అక్కడ బెడ్ రూం గదిలో చీరతో ఉరేసుకుని కనిపించారు. డాక్టర్ మరణం మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఇంట్లో సోదాలు నిర్వహించాం. ఈ సోదాల్లో తన సన్నిహితులు, కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని చూసి తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాసిన ఓ లేఖ దొరికింది. అనంతరం మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబసభ్యలుకు అందించాం అని తెలిపారు. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona