కరోనా ప్రబలకుండా ఉచితంగా వైద్యం  చేస్తానంటూ అందరినీ నమ్మించాడు. అందరూ అతను మంచివాడని నమ్మేశారు. ఈ క్రమంలో ఓ మైనర్ బాలికపై అతని కన్ను పడింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సేలం జిల్లా పెద్దనాయకన్‌పాళయం సమీపం కరుమతురై ప్రాంతంలో క్లినిక్‌ నడుపుతున్న మదియళగన్‌ (24) కరోనా కారణంగా ఆ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల  విద్యార్థినితో డాక్టర్‌కు పరిచయం ఏర్పడింది. 18 ఏళ్లు నిండిన తరువాత వివాహం చేసుకుంటానంటూ ఆ డాక్టర్‌ మాయమాటలు చెప్పి బాలికను మోసంచేశాడు. 

ఇదిలా ఉండగా ఆ డాక్టర్‌కు మరో అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరిగినట్లు తెలుసుకున్న విద్యార్థిని దిగ్ర్భాంతికి గురైంది. దీని గురించి బాలిక కరుమతురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహరంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి పోక్సో చట్టం కింద డాక్టర్‌ను అరెస్టు చేశారు.