తండ్రి సాయంతో కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి..ఆధారాలు కనిపించకుండా దహనం చేసిన ఓ డాక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్ : రైతులపై వాహనాన్ని నడిపి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వైద్యుడు కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని దహనం చేశాడు. ఆధారాలను నాశనం చేశానని అనుకున్న తర్వాత.. నింపాదిగా పోలీసులకు తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. అతను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి.
20 రోజుల కిందట ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాయ్ పుర్ గ్రామానికి చెందిన డాక్టర్ వందనా శుక్లా (28)కి అభిషేక్ దీక్షిత్ అనే డాక్టర్ తో 2014లో వివాహం జరిగింది. ఇద్దరు డాక్టర్లే కావడంతో సీతాపూర్ లో రోబో హాస్పిటల్ కట్టుకున్నారు. అక్కడే ఇద్దరు ప్రాక్టీస్ చేసేవారు. అయితే గత కొన్నాళ్లుగా భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో సొంత ఆస్పత్రిలో కాకుండా వందన చమల్పుర్ లోని లక్ష్మీ నారాయణ హాస్పిటల్ లో పని చేయడం మొదలు పెట్టింది. దీంతో అభిషేక్ కోపానికి వచ్చాడు. అతనికి తండ్రి గౌరీశంకర్ వత్తాసు పలికాడు.
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన.. స్కూల్ విద్యార్థినిపై యాసిడ్ దాడి..
ఇదే విషయమై వందనతో గొడవపడి నవంబరు 26న తండ్రి కొడుకులు ఇద్దరూ ఆమెపై కర్రలతో దాడి చేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి వందన మృతదేహాన్ని ఓ పెట్టెలో పెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి అక్కడే ఉంచి.. ఉదయం ఓ అంబులెన్స్ను అద్దెకు తీసుకున్నారు. అందులో వందన మృతదేహం ఉన్నపెట్టెను పెట్టుకుని 350 కిలోమీటర్ల దూరంలోని గఢ్ ముక్తేశ్వర్ కు తీసుకువెళ్లి దహనం చేశారు.
కూతురు కనిపించకపోవడంతో నవంబర్ 27న మృతురాలి తండ్రి శివరాజ్ శుక్లా పోలీసుల దగ్గరికి వెళ్లాడు. ఆ సమయంలో అతనితో పాటు అల్లుడు అభిషేక్ కూడా ఉన్నాడు. ఇద్దరూ కలిసి వందన కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. ఈ ప్రకారం కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు భార్య భర్తల మధ్య గొడవలు తెలిసి.. అభిషేక్ ఫోన్ కాల్ లిస్టును పరిశీలించారు. అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో అంబులెన్స్ డ్రైవర్ ను ప్రశ్నించారు. ఆ విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ మేరకు అంబులెన్స్ డ్రైవర్ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో నిందితుడిని, అతని తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
