ఢిల్లీ: పెరోల్ మీద బయటకు వచ్చి తప్పించుకు తిరుగుతున్న సీరియల్ కిల్లర్ దేవేంద్ర శర్మను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు చెందిన నార్కోటిక్స్ సెల్ అరెస్టు చేసింది. దాదాపు యాభై మంది ట్రక్ డ్రైవర్ల హత్యల వెనక అతని హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దేవేంద్ర శర్మను నార్కోటిక్ సెల్ సిబ్బంది బుధవారం బాప్ రైలాలోని అతని నివాసంలో అరెస్టు చేశారు 

అతను దాదాపు యాభై మంది టాక్సీ, ట్రక్ డ్రైవర్లను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతన్ని పోలీసులు డాక్టర్ డెత్, సీరియల్ కిల్లర్, హర్యానా ఘరానా నేరగాడు అని పిలుస్తుంటారు అతను ఆయుర్వేద డాక్టర్. హత్యలు చేసి శవాలను తన సిబ్బంది సహాయంతో కాలువలో మొసళ్లకు ఆహారంగా వేసేవాడు. దానివల్ల హత్యలకు సంబంధించిన సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు.

కిడ్నీ రాకెట్ ను కూడా అతను నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 125 మంది కిడ్నీలను అక్రమంగా తొలగించి, మార్పిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెరోల్ జంపింగ్ కేసులో రాజస్థాన్ కు చెందిన జైపూర్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 

ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దేవేంద్ర శర్మ 2020 జనవరిలో పెరోల్ జంప్ చేసి, ఢిల్లీలోని బాప్ రైలాలో దాక్కున్నట్లు నార్కోటిక్స్ సెల్ ఇన్ స్పెక్టర్ రామ్ మనోహర్ కు సమాచారం అందిందని క్రైమ్ బ్రాంచ్ డీసీపీ రాకేశ్ పొవారియా చెప్పారు. ఆయన పర్యవేక్షణలో పోలీసులు దాడి చేసి 62 ఏళ్ల దేవేంద్ర శర్మను అరెస్టు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దేవేంద్ర శర్మ ఓ వితంతువును వివాహం చేసుకుని అజ్ఢాతంలో ఉంటున్నాడు. దానిపై జైపూర్ పోలీసులకు సమాచారం అందింది. అతన్ని జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ట్రక్ డ్రైవర్లను హత్య చేసి కాస్గంజ్ సమీపంలోని హజా కాలువలో శవాలను మొసళ్లకు ఆహారంగా వేసిన తర్వాత వారికి చెందిన ట్రక్కులను అమ్మేసేవాడు.

వంద హత్యలు చేశానని దేవేంద్ర శర్మ స్వయంగా చెప్పాడు. యాబై తర్వాత తాను లెక్కలు చూడడం మానేశాని, వంద హత్యలు చేశానని అతను పోలీసులకు చెప్పి ఉంటాడని, దాన్ని గుర్తు పెట్టుకోవడం అంత సులభం కాదని డిసీపీ అన్నారు.