Asianet News TeluguAsianet News Telugu

హిందీ త‌ప్ప‌నిస‌రిపై మండిప‌డుతున్న‌ ద‌క్షిణాది రాష్ట్రాలు.. అక్టోబరు 15న డీఎంకే నిరసన 

హిందీ భాషపై పార్లమెంటరీ కమిటీ నివేదికకు వ్యతిరేకంగా తమిళనాడులో నిరసన తెలపాలని డీఎంకే నిర్ణయించింది. అక్టోబరు 15న తమిళనాడు అంతటా నిరసనలకు డీఎంకే ప్లాన్ చేసింది.

DMK to launch protest in Tamil Nadu against Centre's Hindi imposition
Author
First Published Oct 13, 2022, 3:37 PM IST

దేశవ్యాప్తంగా కేంద్ర విశ్వవిద్యాలయాలు సహా అన్ని సాంకేతిక, సాంకేతికేతర, వైద్య యూనివర్సిటీల్లో  హిందీని బోధనా మాధ్యమంగా చేయాలని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసు చేసిన విష‌యం తెలిసిందే.. ఈ సిఫార‌సుకు వ్యతిరేకంగా తమిళనాడులో నిరస‌న‌లు వెల్లువెత్తున్నాయి. అధికార డీఎంకే యువజన, విద్యార్థి విభాగం   రాష్ట్రవ్యాప్త నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయాల‌ని పిలుపునిచ్చింది.

ఈ క్ర‌మంలో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) యూత్ వింగ్ సెక్రటరీ ఉదయనిధి స్టాలిన్, విద్యార్థి విభాగం కార్యదర్శి సీవీఎంపీ ఎజిలరసన్ బుధవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న హిందీ విధింపు విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తామ‌ని ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో నెల 15న తమిళనాడు అంతటా నిరసనలకు డీఎంకే ప్లాన్ చేస్తుంది.
 
పార్లమెంటరీ కమిటీ నివేదికను గతంలో సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు. అక్టోబర్ 10న స్టాలిన్ ట్వీట్ చేస్తూ, "కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హిందీని ద‌క్షిణాది రాష్టాల‌పై బ‌ల‌వంతంగా రుద్దుతుంద‌ని,  భారతదేశ వైవిధ్యాన్ని తిరస్కరించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ నివేదిక వాల్యూమ్ 11లోని తీర్మానాలు నేరుగా భారతదేశ ఆత్మపై దాడి చేస్తున్నాయి . అని పేర్కొన్నారు.

ఆయన తన ట్వీట్‌లో ఇంకా ఇలా అన్నారు,  పార్ల‌మెంట‌రీ క‌మిటీ సిఫార‌సుల‌ను అమలు చేస్తే.. హిందీ మాట్లాడే వారు..  స్వంత దేశంలోనే ఇతర భాషాలు మాట్లాడేవారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా ప‌రిగ‌ణిస్తారు.   హిందీని బ‌ల‌వంతంగా రుద్దడం భారతదేశ సమగ్రతకు విరుద్ధం. గ‌తంలో జ‌రిగిన హిందీ వ్యతిరేకం ఉద్యమాల నుంచి బిజెపి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాలి. అని పేర్కొన్నారు. 

కేరళ సీఎం ప్రధానికి లేఖ

కాగా, హిందీ భాషను ద‌క్షిణాది రాష్ట్రాల‌పై బ‌ల‌వంతంగా రుద్దే ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఈమేర‌కు అక్టోబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర సర్వీసులకు నిర్వహించే పరీక్షల్లో హిందీని మాధ్యమంగా మార్చాలని, హిందీని తప్పనిసరి చేయాలని పార్లమెంటు అధికార భాషా కమిటీ సిఫార్సులు వెలువ‌డిన నేప‌థ్యంలో కేరళ సీఎం విజయన్ ప్రధానికి లేఖ రాశారు.  

పార్లమెంటు కమిటీ ఏం చెప్పింది..?

అధికార భాష విష‌యంపై కేంద్ర‌హోం శాఖ‌ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఏర్పాటైన‌ పార్లమెంటు కమిటీ త‌న సిఫారసుల‌ను వెల్ల‌డించింది. దేశవ్యాప్తంగా కేంద్ర విశ్వవిద్యాలయాలు సహా అన్ని సాంకేతిక, సాంకేతికేతర, వైద్య యూనివర్సిటీల్లో హిందీని బోధన మధ్య‌మంగా కొన‌సాగించాలని సూచించింది. బీహార్‌, జార్ఖండ్‌, యూపీ, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, అండమాన్‌-నికోబార్‌ దీవుల్లోని హైకోర్టుల్లో కార్యకలాపాలు  హిందీలోనే జరగాలని సూచించింది. ఇటీవ‌ల‌ మొత్తం 112 సిఫారసులతో కూడిన నివేదిక‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. 

పెరుగుతున్న ఆందోళనలు

పార్ల‌మెంట‌రీ క‌మిటీ నివేదిక వెలువ‌డిన త‌రువాత‌  దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో హిందీకి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌ధానంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల‌ల్లో భాషాభిమానులు ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌ను చేస్తున్నారు. ప్రధాన నాయ‌కులు కూడా హిందీకి వ్య‌తిరేకంగా త‌మ గ‌ళాల‌ను విప్పుతున్నారు. మ‌రోవైపు.. ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతున్నాయి. త‌మ రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios