తమిళనాడులోని వేలూరులో జరిగిన ఉప ఎన్నికల్లో డీఎంకె ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో అన్నాడిఎంకె అభ్యర్ధి షణ్ముగంపై డిఎంకె అభ్యర్ధి ఆనంద్ గెలుపొందారు.
చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో డీఎంకె అభ్యర్ధి కతిర్ ఆనంద్ విజయం సాధించారు.
అధికార అన్నాడిఎంకె అభ్యర్ధి ఎసీ షణ్ముగంపై 8,141 ఓట్ల మెజారిటీతో కతితర్ ఆనంద్ విజయం సాధించారు.కతిర్ ఆనంద్ డీఎంకె సీనియర్ నేత దురై మురుగణ్ కొడుకు.
ఈ ఎన్నికల్లో టీటీవీ దినకరన్ పార్టీ , కమల్ హాసన్ పార్టీ పోటీకి దూరంగా ఉన్నాయి.ఈ నియోజకవర్గంలో డీఎంకె విజయంతో బీజేపీ వ్యతిరేక ప్రచారానికి ఊతమిచ్చినట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో అన్నాడీఎంకె బీజేపీకి మద్దతుగా నిలిచింది.ఈ బిల్లుపై చర్చ జరిగే సమయంలోనే వేలూరు ఉప ఎన్నిక జరిగింది. ఈ నియోజకవర్గంలో గణనీయమైన సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉంటారు. అయినా కూడ బీజేపీకి ఆశించిన ప్రయోజనం దక్కలేదని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.
కేంద్రంలోని బీజేపీతో పాటు ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా డీఎంకె ప్రచారం నిర్వహించింది.
ఈ ఏడాది మార్చి 29వ తేదీన జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. డీఎంకె అభ్యర్ధికి చెందిన ఓ గోడౌన్ లో భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకొన్నారు. దీంతో ఆ సమయంలో ఎన్నికను రద్దు చేశారు.
రాష్ట్రంలోని 38 ఎంపీ స్థానాలను ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగితే 37 ఎంపీ స్థానాలను డీఎంకె కైవసం చేసుకొంది. అన్నాడీఎంకె ఒక్క స్థానంతోనే సరిపెట్టుకొంది.
