చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతుంది. అందుకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వదులు కోవడం లేదు. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీలో ఏర్పడిన విభేధాలను అవకాశంగా మలచుకుంది. పళనిస్వామి తమిళనాడు సీఎ సీటు అధిరోహించడానికి తెరవెనుక బీజేపీ పెద్ద కసరత్తు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అదే బీజేపీ అన్నాడీఎంకేలో అధ్యక్ష పీఠం కోసం అన్నదమ్ముల మధ్య జరుగుతున్న పోరును అవకాశంగా మలచుకుంది.  

 డీఎంకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరుణానిధి మరణానంతరం ఆ పార్టీలో నెలకొన్న ఇంటిపోరును సైతం తమకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే డీఎంకేలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఒక వర్గంగా.....కరుణా నిధి పెద్ద కుమారుడు అళగిరి మరో వర్గంగా ఏర్పడి అధ్యక్ష పీఠం కోసం నువ్వా నేనా అన్న రేసులో బల ప్రదర్శనకు దిగుతున్నారు. 

అళగిరి తన సత్తా ఏంటో నిరూపించేందుకు వచ్చెనెల 5న చెన్నైలో భారీ శాంతి ర్యాలీకి శ్రీకారం చుట్టారు. లక్ష మందితో చెన్నై మహానగరంలో శాంతి ర్యాలీ నిర్వహించి తనకు పార్టీ అధ్యక్షుడిని అయ్యే అర్హత ఉందని ప్రజల మద్దతు తనకుందంటూ పరోక్ష సంకేతాలు ఇవ్వనున్నారు. 

అయితే ఈ ఇంటిపోరులో కూడా బీజేపీ తలదూర్చినట్లు సమాచారం. కరుణానిధి మరణానంతరం బీజేపీ జనరల్ సెక్రటరీ, బీజేపీ తమిళనాడు రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధర్ రావు అళగిరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు అరగంటపాటు తాజా రాజకీయాలు భవిష్యత్ రాజకీయాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. కరుణానిధికి నివాళులర్పించిన తర్వాత అళగిరి తన రాజకీయభవిష్యత్ ను రెండు రోజుల్లో ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. ఈ రెండు రోజుల వ్యవధిలో బీజేపీతో అళగిరి సమాలోచనలు జరిపినట్లు ప్రచారం.  

అళగిరి వెనుక బీజేపీ ఉందనడానికి ఆయన తనయుడు ఫేస్ బుక్ లో చేసిన పోస్టు బలాన్నిచేకూరుస్తోంది. అళగిరి తనయుడు దురై దయానిధి తన తాత, పార్టీ అధినేత కరుణానిధి జీవించి ఉంటే మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతికి పార్టీ కార్యక్రమాలన్నీవాయిదా వేసి నివాళులు అర్పించేవారంటూ పేర్కొనడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ తమిళనాడులో పట్టుకోసం ప్రయత్నిస్తోందని అందుకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటుందని జోరుగా చర్చ జరుగుతుంది. 

మరోవైపు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకేకు బీజేపీ మద్దతు పలుకుతుందని గతంలో పెద్ద ఎత్తున విమర్శలు చేసిన స్టాలిన్ తన సోదరుడు వెనుక బీజేపీ మంత్రాంగం నడుతుపుతుందని తెలిసి మండిపడుతున్నారు. ఇప్పటికే తమిళనాట రాజకీయాల్లో బీజేపీ పాత్రను సహించని స్టాలిన్....తమ పార్టీలో జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో వేచి చూడాలి. 

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. దివంగత ఎంజీఆర్, జయలలిత వంటి నేతలు కేంద్రంతో సన్నిహితంగా మెలిగేవారని, ఇప్పుడు వారి ఆశయ సాధనలో నిమగ్నమైన ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని పళని ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. 

ఉభయసభల్లోనూ అన్నాడీఎంకే సభ్యులు  బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. ఈ స్నేహబంధం కొనసాగుతుందని పేర్కొంటూ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో అన్నాడీఎంకే తప్పని సరిగా ఉంటుందంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత తమిళనాట రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో బీజేపీతో అన్నాడిఎంకే సంబంధాలపై సీఎం పళని స్వామి క్లారిటీ ఇచ్చారు. కేంద్రంతో  కలిస్తే తమిళనాడు మరింత అభివృద్ధి చెందుతుందని ప్రకటించారు. కేంద్రానికి తాము బానిసలమో, సేవకులమో ఎంతమాత్రం కాదని...సహృదయభావంతో మెలగుతామని ప్రకటించారు. 

 తమిళనాడుకు ప్రాజెక్టులు సాధించుకోవడం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆమోదముద్ర వేయించుకోవడం సాధ్యమవుతుందన్నారు. తమిళనాడులో ప్రతీ పేదవాడికి ఉచిత ఇళ్లు నిర్మించి ఇస్తామని....పారిశ్రామిక టౌన్‌షిప్ లు ఏర్పాటు చేస్తామని....ఇవన్నీ చెయ్యాలంటే కేంద్రంతో స్నేహంగా ఉండక తప్పదన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది.