Asianet News TeluguAsianet News Telugu

తక్షణమే గవర్నర్‌ను బర్తరఫ్ చేయండి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరిన డీఎంకే

తమిళనాడులో అధికార డీఎంకే, గవర్నర్ ఆర్ఎన్ రవిల మధ్య వివాదం మరింతగా ముదిరింది. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని బర్తరఫ్‌ చేయాలని కోరుతూ డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (ఎస్‌పీఏ) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం అందజేసింది. 

DMK allies urges President Droupadi Murmu to sack Tamil Nadu Governor
Author
First Published Nov 9, 2022, 12:01 PM IST

తమిళనాడులో అధికార డీఎంకే, గవర్నర్ ఆర్ఎన్ రవిల మధ్య వివాదం మరింతగా ముదిరింది. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని బర్తరఫ్‌ చేయాలని కోరుతూ డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (ఎస్‌పీఏ) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం అందజేసింది. ఆర్ఎన్ రవి రాజ్యాంగం ప్రకారం ఆయన చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారని ఆరోపించింది. ఈ మేరకు డీఎంకే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయానికి సమర్పించిన వివరణాత్మక మెమోరాండంలో పెండింగ్‌లో ఉన్న నీట్ బిల్లుతో సహా గవర్నర్‌కు సంబంధించిన అనేక అంశాలను పేర్కొంది. ఈ మెమోరాండంపై ఎస్‌పీఏకు చెందిన పార్లమెంట్ సభ్యులు సంతకం చేశారు. 

ఆయనకు దేశం లౌకిక సిద్ధాంతాలపై విశ్వాసం లేదని బహిరంగంగా ప్రకటించే దురదృష్టకర ప్రవృత్తిని పెంచుకున్నారని డీఎంకే, ఆ పార్టీ మిత్రపక్షాలు రాష్ట్రపతికి సమర్పించిన మెమోరాండంలో ఆరోపించాయి. దేశ లౌకిక తత్వానికి అత్యంత నిబద్ధతతో ఉన్న తమ ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరం అని పేర్కొన్నాయి. ‘‘భారతదేశం ప్రపంచంలోని ఇతర దేశాల వలె ఒక మతంపై ఆధారపడి ఉంది’’ అని రవి చేసిన వ్యాఖ్యలను కూడా ఉదహరించాయి.

‘‘తమిళనాడు ప్రభుత్వం, శాసనసభ చేస్తున్న పనిని గవర్నర్ కార్యాలయం బహిరంగంగా వ్యతిరేకించడం ద్వారా,  బిల్లులకు ఆమోదం తెలుపడంలో విపరీతమైన జాప్యం చేయడం ద్వారా మా అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నాం. తమిళనాడు శాసనసభ అనేక ముఖ్యమైన బిల్లులను ఆమోదించింది. వాటిని ఆమోదం కోసం గవర్నర్‌కు పంపింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్ అనవసరంగా జాప్యం చేస్తున్నారని గమనించడం మాకు బాధ కలిగించింది” అని మెమోరాండంలో డీఎంకే, ఆ పార్టీ మిత్రపక్షాలు పేర్కొన్నాయి. గవర్నర్ ఆమోదం లభించని తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టాల (సవరణ) బిల్లు 2022తో సహా మొత్తం 20 బిల్లులను ఈ మెమోరాండంలో జాబితా చేశారు. నీట్ మినహాయింపు బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడంలో జాప్యాన్ని కూడా మెమోరాండం ప్రధానంగా ప్రస్తావించింది. 

‘‘ఇది రాష్ట్ర పరిపాలనలో, శాసనసభ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడమే. అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం’’ అని పేర్కొంది. 

‘‘రాజ్యాంగం, చట్టాన్ని పరిరక్షిస్తానని.. తమిళనాడు ప్రజల సేవ, శ్రేయస్సు కోసం తనను తాను అంకితం చేస్తానని ఆర్టికల్ 159 కింద చేసిన ప్రమాణాన్ని ఆర్ ఎన్ రవి ఉల్లంఘించారని స్పష్టంగా తెలుస్తుంది. తాను చేసిన ప్రమాణానికి భిన్నంగా మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. రాష్ట్ర శాంతి, ప్రశాంతతకు ముప్పుగా ఉన్నారు. అందువల్ల తన ప్రవర్తన, చర్యల ద్వారా రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిని నిర్వహించడానికి ఆర్ఎన్ రవి అనర్హుడనని నిరూపించారు. తక్షణమే బర్తరఫ్‌కు అర్హులు’’ అని మెమోరాండంలో పొందుపరిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios