కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు బెయిల్ లభించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సెప్టెంబర్ 3న అరెస్ట్ చేసింది. నాటి నుంచి తీహార్ జైలులో శివకుమార్ రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.

బెయిల్ పిటిషన్ కోరుతూ శివకుమార్ ఢిల్లీ కోర్టులో పలుమార్లు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ నిరాశ తప్పలేదు. ఈ క్రమంలో బుధవారం మరోసారి ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా... న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లరాదని విచారణకు పూర్తిగా సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీనితో పాటు 25 లక్షల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీ ఇవ్వాలని కోర్టు తెలిపింది. 

Also Read:ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్: మరో 15 రోజుల రిమాండ్ కు డీకే శివకుమార్

ఈ నెల ప్రారంభంలో డీకే శివకుమార్ కు ఈడీ కోర్టులో చుక్కెదురు అయ్యింది. బెయిల్ మంజూరు చేయాలంటూ డీకే శివకుమార్ పిటీషన్ ను ఈడీ కోర్టు తిరస్కరించింది. 

అంతేకాదు డీకే శివకుమార్ రిమాండ్ ను పొడిగిస్తూ ఆదేశించింది. అక్టోబర్ 15 వరకు ఈడీ కోర్టు డీకే శివకుమార్ కు రిమాండ్ విధించింది. డీకే శివకుమార్ మనీ లాండరింగ్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు డీకే శివకుమార్. ప్రస్తుతం డీకే శివకుమార్ తీహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ వస్తుందని ఆశించిన డీకేకు ఈడీ కోర్టు ఝలక్ ఇవ్వడంతో ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాశ చెందారు. 

మరోవైపు మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్‌ ఎంపీ సురేష్‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్‌ 3న స్వయంగా హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. డీకే శివకుమార్ సోదరుడు సురేష్‌కు సోమవారం నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్‌ శిబిరంలో కలకలం రేపింది. 

ఢిల్లీలోని అపార్ట్‌మెంట్‌లో దొరికిన రూ.40 లక్షలలో రూ.21 లక్షలపై కీలక ఆధారాలు ఉన్నాయని వాటిపై వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులు నోటీసులో సూచించారు. ఇప్పటికే డీకే శివకుమార్ జైలు పాలవ్వడంతో తాజాగా సురేష్ కు నోటీసులు ఇవ్వడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. 

Also Read: నా అరెస్ట్‌తో బీజేపీ మిషన్ పూర్తయ్యింది... బాధితుడిగా మిగిలా: డీకే శివకుమార్

మనీల్యాండరింగ్ కేసులో తనను అరెస్ట్ చేయడంపై కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. తనను అరెస్ట్ చేసి బీజేపీ పంతం నెగ్గించుకుందని మండిపడ్డారు.

ఇందుకు బీజేపీ మిత్రులను అభినందిస్తున్నాని డీకే సెటైర్లు వేశారు. తనపై పెట్టిన ఐటీ, ఈడీ కేసులు పూర్తిగా రాజకీయంగా జరిగినవి.. తాను కూడా బీజేపీ ప్రతీకార రాజకీయాలకు బలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఏ తప్పు చేయలేదని.. పార్టీ కేడర్, కాంగ్రెస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరుతున్నానని.. తనకు దేవుడి మీదా... భారతదేశ న్యాయవ్యవస్థ మీదా నమ్మకం వుందని పేర్కొన్నారు.

ఈ కేసులో తన నిజాయితీ త్వరలోనే తేలుతుందని డీకే మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు శివకుమార్ అరెస్ట్‌పై ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. రాజకీయంగా డీకే ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు ఆయనపై అరెస్ట్ అస్త్రాన్ని సంధించారని ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్న ఆయనకు ఇలాంటి పరిస్ధితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.