మనీల్యాండరింగ్ కేసులో తనను అరెస్ట్ చేయడంపై కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. తనను అరెస్ట్ చేసి బీజేపీ పంతం నెగ్గించుకుందని మండిపడ్డారు.

ఇందుకు బీజేపీ మిత్రులను అభినందిస్తున్నాని డీకే సెటైర్లు వేశారు. తనపై పెట్టిన ఐటీ, ఈడీ కేసులు పూర్తిగా రాజకీయంగా జరిగినవి.. తాను కూడా బీజేపీ ప్రతీకార రాజకీయాలకు బలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఏ తప్పు చేయలేదని.. పార్టీ కేడర్, కాంగ్రెస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరుతున్నానని.. తనకు దేవుడి మీదా... భారతదేశ న్యాయవ్యవస్థ మీదా నమ్మకం వుందని పేర్కొన్నారు.

ఈ కేసులో తన నిజాయితీ త్వరలోనే తేలుతుందని డీకే మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు శివకుమార్ అరెస్ట్‌పై ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. రాజకీయంగా డీకే ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు ఆయనపై అరెస్ట్ అస్త్రాన్ని సంధించారని ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్న ఆయనకు ఇలాంటి పరిస్ధితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్‌కు షాక్: మనీల్యాండరింగ్‌ కేసులో డీకే శివకుమార్ అరెస్ట్