కర్ణాటక: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ కు ఈడీ కోర్టులో చుక్కెదురు అయ్యింది. బెయిల్ మంజూరు చేయాలంటూ డీకే శివకుమార్ పిటీషన్ ను ఈడీ కోర్టు తిరస్కరించింది. 

అంతేకాదు డీకే శివకుమార్ రిమాండ్ ను పొడిగిస్తూ ఆదేశించింది. అక్టోబర్ 15 వరకు ఈడీ కోర్టు డీకే శివకుమార్ కు రిమాండ్ విధించింది. డీకే శివకుమార్ మనీ లాండరింగ్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు డీకే శివకుమార్. ప్రస్తుతం డీకే శివకుమార్ తీహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ వస్తుందని ఆశించిన డీకేకు ఈడీ కోర్టు ఝలక్ ఇవ్వడంతో ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాశ చెందారు. 

మరోవైపు మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్‌ ఎంపీ సురేష్‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్‌ 3న స్వయంగా హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. డీకే శివకుమార్ సోదరుడు సురేష్‌కు సోమవారం నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్‌ శిబిరంలో కలకలం రేపింది. 

ఢిల్లీలోని అపార్ట్‌మెంట్‌లో దొరికిన రూ.40 లక్షలలో రూ.21 లక్షలపై కీలక ఆధారాలు ఉన్నాయని వాటిపై వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులు నోటీసులో సూచించారు. ఇప్పటికే డీకే శివకుమార్ జైలు పాలవ్వడంతో తాజాగా సురేష్ కు నోటీసులు ఇవ్వడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.