కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఈరోజు వెలువడుతుందని చెబుతున్నారు. అయితే సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య సఖ్యత కుదర్చడంతో కాంగ్రెస్ అధిష్టానం విజయం సాధించినట్టుగా కనిపిస్తుంది. గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నప్పటికీ సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లు ఒకరినొకరు కలుసుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో కూడా విడి విడిగా సమావేశం అయ్యారు.
అయితే కర్ణాటక సీఎం పీఠంపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడటంతో.. ఈ రోజు ఉదయం డీకే శివకుమార్, సిద్దరామయ్యలు కలిసి మల్లికార్జున ఖర్గేతో భేటి అయ్యారు. ఇందుకోసం ఇద్దరు ఒకే కారులో ఖర్గే నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారితో భేటీకి సంబంధించి ఫోటోను షేర్ చేసిన ఖర్గే.. ‘‘కర్ణాటక ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం టీమ్ కాంగ్రెస్ కట్టుబడి ఉంది. మేము 6.5 కోట్ల మంది కన్నడిగులకు హామీ ఇచ్చిన 5 హామీలను అమలు చేస్తాము’’ అని పేర్కొన్నారు.
ఇక, అంతకుముందు ఈ రోజు ఉదయం.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జి రణదీప్ సూర్జేవాలా ఈరోజు ఉదయం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఖర్గే నివాసానికి చేరుకున్నారు.
అయితే ప్రస్తుతం ఈ సమావేశాల్లో కర్ణాటక కేబినెట్ కూర్పుపై చర్చలు జరుగుతున్నాయి. డీకే శివకుమార్, సిద్దరామయ్యల అభిప్రాయాలతో పాటు.. కర్ణాటకకే చెందిన మల్లికార్జున ఖర్గే సూచనలతో కేబినెట్ తుది రూపు దాల్చనుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సీఎం పీఠంపై పంతం వీడిన డీకే శిమ కుమార్ రాష్ట్ర కేబినెట్‌లో కీలక శాఖలను చేపట్టడంతో.. తనవారికి కొన్ని శాఖలు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
