వాయు కాలుష్యం : దీపావళి ఎఫెక్ట్... ఢిల్లీ తరువాతి స్థానాల్లో ముంబై, కోల్ కతా...
ఢిల్లీలో వాయుకాలుష్యం బీభత్సకరస్థాయికి చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత కొద్దిసేపటికే ఏక్యూఐ ప్రమాదకర 680కి చేరుకుంది.
న్యూఢిల్లీ : దీపావళి వేడుకల తరువాత అత్యంత కాలుష్య పూరితమైన చెత్త నగరాల్లో ఢిల్లీ తరువాత చోటు దక్కించుకున్నాయి మరో రెండు నగరాలు. అవే వరుసగా ముంబై, కోల్ కతాలు. ఆదివారం దీపావళి సంబరాల తరువాత రెండు భారతీయ నగరాలు కాలుష్యానికి సంబంధించి ప్రపంచంలోని అత్యంత చెత్త 10 నగరాల్లో ఒకటిగా నిలిచాయి.
ఈ లిస్టులో ఎప్పట్లాగే న్యూఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. స్విస్ గ్రూప్ లెక్క కట్టిన ఐక్యూఏ ప్రకారం... ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫిగర్ 420 ఉంది. దీంతో, ఢిల్లీని 'ప్రమాదకర' కేటగిరీగా పేర్కొంది. ఈ లిస్టులో కోల్‌కతా టాప్ 10లో చేరింది, ఇది 196 ఏక్యూఐతో నాల్గవ స్థానంలో నిలిచింది. ముంబై ఆర్థిక రాజధాని 163 ఏక్యూఐతో ఎనిమిదో స్థానంలో ఉంది.
ఏక్యూఐ స్థాయి 400-500 ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ప్రభావం చూపుతుంది ఇప్పటికే ఉన్న వ్యాధులు ఉన్నవారికి ప్రమాదకరం, అయితే 150-200 స్థాయి ఆస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. 0-50 స్థాయి ఏక్యూఐలు మంచివిగా పరిగణించబడతాయి.
ఆదివారం రాత్రి నుండి న్యూ ఢిల్లీలో ఒక దట్టమైన పొగమంచు వ్యాపించడం ప్రారంభించింది. ఈ పొగమంచు అర్ధరాత్రి తర్వాత కొద్దిసేపటికే ఏక్యూఐని ప్రమాదకర 680కి చేరుకునేలా చేసింది.
ఏటా రాజధానిలో బాణసంచా కాల్చడంపై అధికారులు నిషేధం విధిస్తుంటారు. అయితే చాలా అరుదుగా మాత్రమే ఆ నిషేధాలు అమలులో కనిపిస్తున్నాయి. వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ ధూళి, వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చే కాలుష్య కారకాలను చల్లని గాలి ట్రాప్ చేస్తున్నప్పుడు, శీతాకాలానికి ముందు భారతదేశంలో గాలి నాణ్యత ప్రతి సంవత్సరం క్షీణిస్తుంది.
శుక్రవారం కొద్దిసేపు వర్షం కురిసిన తర్వాత వారం రోజుల పాటు ఇబ్బందులకు గురిచేసిన కాలుష్యం కాస్త కంట్రోల్ లోకి వచ్చిందని అంతా భావించారు. కానీ అంతలోనే దీపావళితో ఈ పరిస్థితి మరింత విషమంగా మారింది.