తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియాను వెంటనే విడుదల చేసేలా ఆదేశించాలని స్టాలిన్ మోదీని కోరారు. భారత్‌లో వేర్వేరు సిద్ధాంతాల రాజకీయ పార్టీలున్నాయని, ఇదే భారత ప్రజాస్వామ్య ప్రత్యేకత అని స్టాలిన్ లేఖలో రాశారు. సిసోడియా అరెస్ట్ తనను అసంతృప్తికి గురిచేసిందన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi liquor policy scam case)లో అరెస్టయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను బేషరతుగా విడుదల చేసేందుకు దిశానిర్దేశం చేయాలని ఆయన కోరారు. ఇందుకోసం అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, గవర్నర్ కార్యాలయం సహా రాజ్యాంగ కార్యాలయాలు భారతదేశంలో శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని ఎన్నటికీ బలోపేతం చేయలేవని స్టాలిన్ అన్నారు.
భిన్న సిద్ధాంతాలు, విభిన్న రాజకీయ పార్టీలున్నాయని, భారత ప్రజాస్వామ్యానికి గుండెకాయ అని , ఇదే భారత ప్రజాస్వామ్య ప్రత్యేకతను అంగీకరిస్తారని ఆశిస్తున్నానని స్టాలిన్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా, న్యాయవ్యవస్థ , వ్యక్తిగత స్వేచ్ఛ మన న్యాయ వ్యవస్థకు మూలస్తంభాలు. మనీష్ సిసోడియాను తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేశారని తెలుసుకుని తాను చాలా బాధపడ్డాననీ, తీవ్ర నిరాశ చెందానని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించి వేధిస్తున్నారని, సిసోడియా అరెస్ట్ తనను అసంతృప్తికి గురిచేసిందన్నారు.
నేర న్యాయ వ్యవస్థలోని సూత్రాలన్నీ గాలికి ఎగిరిపోయాయని ముఖ్యమంత్రి లేఖలో ఆరోపించారు. కేంద్రంలోని అధికార పార్టీ వ్యక్తిగత సంతృప్తి కోసం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తోంది. గత తొమ్మిదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసింది. ప్రతిపక్ష పార్టీల రాజకీయ నేతలను వేధించేందుకు ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారు.
గతంలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మద్దతు కూడా లభించింది. సిసోడియా కేసులో తన నిరసనను తెలుపుతూ విజయన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాజకీయ కుట్రతో సిసోడియా, ప్రతిపక్ష నేతలను ఇరికిస్తున్నారని ఆయన లేఖలో ఆరోపించారు. దేశంలోని వివిధ విపక్ష పార్టీల నేతలు ప్రధానికి లేఖ రాసిన రోజుల వ్యవధిలోనే స్టాలిన్ కూడా లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ రెండ్రోజుల క్రితం ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. మనీశ్ సిసోడియా అరెస్టును తీవ్రంగా ఖండించారు.
వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత సిసోడియాను ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయ్యాడు. అతడిని సీబీఐ కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ప్రస్తుతం సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. మరోవైపు మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం జైలులోనే ఆయనను ప్రశ్నించింది.
