ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్ట్.. అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరా.. ఎవరి ఒత్తిడి లేదని వెల్లడి..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడు, వ్యాపారవేత్త దినేష్ అరోరా అప్రూవర్‌గా మారారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడు, వ్యాపారవేత్త దినేష్ అరోరా అప్రూవర్‌గా మారారు. ఈ కేసులో దినేష్ అరోరా సాక్షిగా చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈరోజు 306 సీఆర్‌పీసీ కింద ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టులో సోమవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా.. దినేష్ అరోరా ఈ కేసులో క్షమాపణ కోరారు. సీఆర్‌పీసీ సెక్షన్ 164 (ఒప్పుకోలు, స్టేట్‌మెంట్‌ల రికార్డింగ్) కింద తాను ఒప్పుకోలు ప్రకటన చేశానని చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని వాస్తవాలను వెల్లడించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దినేష్ అరోరా తెలిపారు.
ఆరోపించిన నేరాలలో తన ప్రమేయం గురించి స్వచ్ఛందంగా వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నానని దినేష్ అరోరా ఢిల్లీ కోర్టుకు తెలిపారు. ఈ కేసు దర్యాప్తునకు తాను ఇంతకు ముందు సీబీఐకి సహకరించాను అని చెప్పారు. సీబీఐ తనపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని కూడా వెల్లడించారు. ఎటువంటి బలవంతం, ప్రభావం లేకుండా తాను ఈ ప్రకటన చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ కేసులో తనకు క్షమాపణ ఇవ్వాలని అభ్యర్థించారు. తాను అన్ని నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉండటానికి సిద్దంగా ఉన్నానని కోర్టుకు తెలిపారు. ఇక, ఈ కేసులో క్షమాపణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు నవంబర్ 14న విచారించనుంది.
ఇక, ఈ కేసులో బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించకపోవడంతో దినేష్ అరోరాకు కొన్ని రోజుల క్రితం ఇదే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌కు వ్యతిరేకంగా సీబీఐ ఇచ్చిన సమాధానంలో.. దరఖాస్తుదారు దర్యాప్తుకు మద్దతు ఇచ్చారని, దర్యాప్తుకు కీలకమైన కొన్ని వాస్తవాలను వెల్లడించారని పేర్కొంది. అందువల్ల అభ్యర్థికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే సీబీఐకి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపింది. ఇక, దినేష్ అరోరా అప్రూవర్ మారి.. కోర్టు ముందు క్షమాపణ కోరిన నేపథ్యంలో ఈ కేసులో తర్వాత చోటుచేసుకునే పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.