తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా సాగుతుంటాయి. ముఖ్యంగా డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల మధ్య రసవత్తర రాజకీయాలు జరుగుతుంటాయి.అయితే మాజీ ముఖ్యమంత్రి  జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీ మెత్తబడిపోయింది. ఆ పార్టీకి సరైన నాయకత్వం లేక నాయకులు, కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. జయలలిత మరణం తర్వాత పార్టీ రెండుగా చీలినా శశికళ జైలుకు పోవడంతో మళ్లీ రెండు వర్గాలు ఒక్కటయ్యాయి. 

అయితే ఈ రెండు వర్గాలను మళ్లీ విడదీసేందుకు అన్నా డీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టిటివి దినకరన్ మైండ్ గేమ్ ప్రారంభించారు. ప్రస్తుతం సీఎం పళని స్వామిని కాదని డిప్యూటి సీఎం పన్నీరు సెల్వం తనతో చేతులు కలపడానికి సిద్దంగా ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్ పార్టీతో కలిసి పనిచేసేందుకు ఓపిఎస్ ఆసక్తి కనబర్చారని దినకరన్ తెలిపారు. 

సెప్టెంబర్ నెలలో ఓ మద్యవర్తి ద్వారా పన్నీరు సెల్వం తన అపాయింట్ మెంట్ కోరారని దినకరన్ వెల్లడించారు. కానీ తమ మద్య భేటీ మాత్రం జరగలేదని తెలిపాడు. తనతో చేతులు కలిపేందుకు సిద్దంగా ఉన్నట్లు పన్నీరు ఆ సందేశంలో తెలిపాడని దినకరన్ పేర్కొన్నారు.

అంతే కాదు పళని వర్గంతో కలిసే ముందు ఓపిఎస్ తనను కలిశాడంటూ సంచలన విషయాలు వెల్లడించాడు. ప్రభుత్వంలో తనకు మంచి స్థానం కల్పిస్తానని...తనకు మద్దతివ్వాలని పన్నీరు కోరినట్లు దినకరన్ తెలిపాడు. పన్నీరు సీఎం పదవి కోసం ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తుండటం వల్లే ఈ విషయాలను బైటపెడుతున్నట్లు దినకరన్ చెప్పారు.