ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ ఘన విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ ఘన విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంది. సమాజ్‌వాదీ వ్యవస్థాపకుడు, మెయిన్‌పురి ఎంపీగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో నిలిచారు. బీజేపీ నుంచి రఘురాజ్ సింగ్‌ పోటీ చేశారు. 

ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలతో పాటు, మెయిన్‌పూరి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 5వ తేదీన జరిగింది. హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే.. ఈ రోజు ఉదయం ఆ స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు చేపట్టారు. మెయిన్‌పురిలో డింపుల్ యాదవ్ భారీ విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి రఘురాజ్ సింగ్‌పై 2,88,136 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పేర్కొన్న డేటా ప్రకారం.. డింపుల్ యాదవ్‌కు 6,17,625 ఓట్లు రాగా, రఘురాజ్ సింగ్‌కు 3,29,489 ఓట్లు వచ్చాయి. ఇక, 2019 లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందినప్పుడు ములాయం సింగ్‌‌కు 94 వేల ఆధిక్యం మాత్రమే వచ్చింది. 

ఇక, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ గతంలో కన్నౌజ్ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2012లో యూపీ సీఎంగా అఖిలేష్ యాదవ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన భర్త ఖాళీ చేసిన కన్నౌజ్ నుంచి డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికై తొలిసారి ఎంపీ అయ్యారు. ఆమె 2014లో సీటును నిలబెట్టుకున్నారు. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన సుబ్రత్ పాఠక్ చేతిలో ఓడిపోయారు.