ముంబై : రోజురోజుకి మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. కొందరు కామాంధులు కామంతో రెచ్చిపోతున్నారు. ఆడపిల్లలు కనబడితే చాలు వేధింపులకు పాల్పడుతున్నారు. తాకరాని చోట తాకుతూ అమ్మాయిలను వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 

తాజాగా ఇలాంటి ఘటనే ఓ దివ్యాంగురాలికి ఎదురైంది. తనను వేధింపులకు గురిచేసిన ఆకతాయికి సరైన బుద్ధి చెప్పింది. దివ్యాంగురాలు అయినంత మాత్రాన తనను తేలికగా తీసుకోవద్దని అతడి వేళ్లు పాక్షికంగా విరిచేసి పోలీసులకు పట్టించింది.  

వివరాల్లోకి వెళ్తే ముంబైకి చెందిన ఓ పదిహేనేళ్ల బాలిక తన తండ్రితో కలిసి లోకల్‌ ట్రెయిన్‌లో ప్రయాణిస్తుంది. దివ్యాంగురాలు కావడంతో తమ కోసం ప్రత్యేకంగా కేటాయించడిన కంపార్ట్‌మెంట్‌లో ఎక్కింది. ఆ సమయంలో ఆమెకు తోడుగా తండ్రి కూడా ఉన్నాడు.

అయితే విశాల్‌ బలరామ్‌ సింగ్‌ అనే యువకుడు దివ్యాంగురాలు ప్రయాణిస్తున్న కంపార్ట్మెంట్ లోకి వచ్చాడు. రాత్రి సమయం, రద్దీ ఎక్కువగా లేకపోవడంతో బాలికను వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెట్టడంతో ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది. 

తండ్రి ఆ యువకుడిని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ పోకిరి తన ప్రవర్తన మార్చుకోలేదు సరికదా మరింత రెచ్చిపోయాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆ బాలిక స్కూల్లో నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్సింగ్ స్కిల్స్ ను అతడిపై ప్రయోగించింది.  

యువకుడి చేయి గట్టిగా మెలితిప్పి వేళ్లను పాక్షికంగా విరిచేసింది. దివ్యాంగురాలిని కదా అని ఇష్టం వచ్చినట్లు తాకుతావా అంటూ ఇక కొట్టడం కూడా మెుదలుపెట్టింది. ఈలోగా ఆమె తండ్రి రైల్వే పోలీసులకు ఫోన్ చెయ్యడంతో దాదర్ రైల్వే స్టేషన్ లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

దివ్యాంగులు అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది వీళ్లను ఏం చేసినా పడి ఉంటారులే అనుకుంటారని దివ్యాంగురాలు ఆరోపించింది. కానీ తమ స్కూళ్లో కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించారని ఆత్మరక్షణ కోసం ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేదని మా టీచర్లు ఆత్మవిశ్వాసం నింపారని చెప్పుకొచ్చింది. 

అదే ఈరోజు పనికివచ్చిందని ఆ బాలిక తెలిపింది. అతడు ఇంకోసారి ఎవరితో అసభ్యంగా ప్రవర్తించకూడదనే అలా చేశాను అంటూ చెప్పింది. బాలిక ధైర్యాన్ని చూసి ఆమె సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ చూసి తోటి వారు ఔరా అనిపించారు. బాలికను అభినందించారు.