Fact Check: ఇందిరా గాంధీ హత్యను కీర్తించే హూడీ.. సింగర్ శుభ్‌నీత్ సింగ్ నిజంగానే ప్రమోట్ చేశాడా?
ప్రముఖ సింగర్, పంజాబ్ - కెనడా సింగర్ శుభ్ నీత్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇందిరా గాంధీ హత్యను కీర్తించే చిత్రం ప్రింట్ చేసిన హూడీని తన కాన్సర్ట్‌లో ప్రమోట్ చేసినట్టుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది నుంచి ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కానీ, ఫ్యాక్ట్ చెక్‌లో ఇదంతా అవాస్తవం అని తేలింది.
న్యూఢిల్లీ: ప్రముఖ పంజాబీ - కెనడియన్ సింగర్, ర్యాపర్ శుభ్‌నీత్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ హత్యను కీర్తించేలా ఆయన వ్యవహరించారని, ఇటీవలే లండన్‌లో నిర్వహించిన ఓ కాన్సర్ట్‌లో ఆమె హత్యను వర్ణించే ఓ చిత్రపటం ప్రింట్ చేసిన హూడీని ఆయన ప్రమోట్ చేసినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఖలిస్తానీ అనుకూల ఓ ట్విట్టర్ హ్యాండిల్ ఈ విషయాన్ని పోస్టు చేసింది. అమరుడు సత్వంత్ సింగ్, అమరుడు బియంత్ సింగ్‌ల త్యాగాలను ఎత్తిపడుతూ ఇందిరా గాంధీ హత్యను చిత్రించే ఓ ఫొటో ఆ హూడీపై ఉన్నదని ఆ హ్యాండిల్ పేర్కొంది.
దీంతో సహజంగానే శుభ్‌నీత్ సింగ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో కనిపించేవాటిని అన్నింటినీ యథాతథంగా విశ్వసించలేం. ఈ నేపథ్యంలోనే ఆ వీడియో ఫ్యాక్ట్ చేశారు. ఆ వీడియోతో పాటు చేస్తున్న వ్యాఖ్యానాలు అవాస్తవాలని తేలింది. శుభ్‌నీత్ సింగ్ ప్రమోట్ చేసిన హూడీలో ఇందిరా గాంధీ హత్యను కీర్తించే అంశాలేవీ లేవని తెలియవచ్చింది. ఆ హూడీపై పంజాబ్ రాష్ట్ర చిత్రపటం ఉన్నదని, జిల్లాల సరిహద్దు స్పష్టంగా కనిపించేలా ఆ చిత్రం ఉన్నదని ఫ్యాక్ట్ చెక్ రిపోర్టులు తేల్చాయి.
ఓప్ ఇండియా ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, శుభ్ నీత్ సింగ్ చూపించిన హూడీపై ఇందిరా గాంధీ చిత్రమే లేదు. కేవలం పంజాబ్ మ్యాప్ ఉన్నది. అందులో జిల్లాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ హూడీ.. ఖలిస్తానీ అనుకూల ట్విట్టర్ హ్యాండిల్ ప్రచారం చేస్తున్న హూడీ ఒకేలా ఉన్నాయి. దగ్గరి పోలికలు ఉన్నాయి.
Also Read: నాన్నమ్మే నా బలం - ఇందిరా గాంధీని సర్మించుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..
కాగా, ఈ అవాస్తవ వీడియో బారిన, ఈ దుష్ప్రచారం బారిన ప్రముఖ నటి కంగనా రనౌత్ పడ్డారు. ఆమె శుభ్ నీత్ సింగ్ పై విమర్శలు సంధించారు. ఇందిరా గాంధీని హత్య చేసిన ఘటనను కీర్తించాడని, ఒక పెద్దావిడను, నిరాయుధురాలిని హత్య చేసిన ఉదంతాన్ని గొప్పగా చేసి చూపిస్తున్నాడని మండిపడ్డారు.
ఇటీవలే కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగినప్పుడు శుభ్ నీత్ వివాదంలో ఇరుక్కున్నారు. ఖలిస్తానీ వేర్పాటువాదులకు ఆయన మద్దతు ప్రకటించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు.