మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ జర్నలిస్ట్ ఎంజే అక్బర్ గత కొంతకాలంగా మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయన తనను లైంగికంగా వేధించాడంటూ... మహిళా జర్నిలిస్ట్ ఆయనపై ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆయన న్యాయస్థానంలో వివరణ ఇచ్చారు.

పాత్రికేయురాలు ప్రియా రమణిని ఇంటర్వ్యూ నిమిత్తం హోటల్‌కు రావాల్సిందిగా అడగలేదని కేంద్ర మాజీ మంత్రి ఎం.జె.అక్బర్‌ సోమవారం న్యాయస్థానానికి తెలిపారు. 1994లో ఏసియన్‌ ఏజ్‌ పత్రికకు సంపాదకుడిగా ఉన్న అక్బర్‌ ఉద్యోగం కోసం వచ్చిన తనను లైంగికంగా వేధించారని ‘మీ టూ’ ఉద్యమం సందర్భంగా ప్రియా రమణి ఆరోపించారు. 

ఆ తర్వాత మరి కొందరు మహిళలూ అక్బర్‌పై అదే విధమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో గత ఏడాది అక్టోబరులో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రమణిపై అక్బర్‌ న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేయగా దీనికి సంబంధించి సోమవారం దిల్లీలోని అదనపు ఛీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సమర్‌ విశాల్‌ ముందు ఇరు పక్షాల వాదనలు కొనసాగాయి. 

ఈ సందర్భంగా రమణి తరఫు న్యాయవాది అడిగిన ప్రశ్నలకు అక్బర్‌ సమాధానమిస్తూ తనపై చేసిన ఆరోపణలను గట్టిగా తోసిపుచ్చారు. ఆమెను హోటల్‌ గదికి రావాలని పిలవలేదని తెలిపారు.