Asianet News TeluguAsianet News Telugu

IndiGo: ఇండిగో ఎయిర్‌లైన్స్ కు రూ.5 ల‌క్ష‌ల ఫైన్...

fine on IndiGo:  దివ్యాంగ చిన్నారిని విమానంలోనికి ఎక్కించుకోవ‌డానికి నిరాక‌రించిన ఇండిగో ఎయిర్ లైన్స్ పై డీజీసీఏ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇండిగో కు రూ.5 ల‌క్ష‌ల ఫైన్ విధించింది. 
 

DGCA imposes Rs 5 lakh fine on IndiGo for denying boarding to special needs child
Author
Hyderabad, First Published May 28, 2022, 4:46 PM IST

DGCA imposes ₹5 lakh fine on IndiGo: మే 7న రాంచీ ఎయిర్‌పోర్ట్‌లో తన తల్లిదండ్రులతో పాటు ఒక దివ్యాంగ చిన్నార‌ని విమానంలోకి ఎక్కించుకోవ‌డానికి ఇండిగో ఎయిర్‌లైన్స్ నిరాకరించింది. ఈ ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఏవియేషన్ వాచ్‌డాగ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA).. భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోపై రూ.5 లక్షల జరిమానా విధించింది. ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణంగా స్పందించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. ఆ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది సందర్భానికి తగినట్లుగా వ్యవహరించడంలో విఫలమయ్యారనీ, పౌర విమానయాన నిబంధనల స్ఫూర్తికి విరుద్ధంగా వారు న‌డుచుకున్నార‌ని ఆరోపించింది. సంబంధిత నియమ, నిబంధనల మేరకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ.5 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించినట్లు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
 

కాగా, రాంచీ విమానాశ్ర‌యంలో ఓ దివ్యాంగ చిన్నారిని ఇండిగో విమానంలోకి ఎక్కనివ్వలేదు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌ వెళ్లేందుకు గత శనివారం దివ్యాంగ చిన్నారితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే ఆ దివ్యాంగ‌ బాలుడుని విమానం ఎక్కేందుకు ఇండిగో (IndiGo) సిబ్బంది నిరాకరించారు. ఇండిగో తీరుపై అక్క‌డున్న ప్ర‌యాణికుల‌తో పాటు దివ్యాంగ చిన్నారి తల్లిదండ్రులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. పిల్లాడిని విమానంలోకి ఎక్కడానికి అనుమ‌తించాల‌ని కోరారు. అయితే, ఇండిగో సిబ్బంది  బాలుడి కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. చిన్నారి భ‌యంతో ఉన్నాడ‌నీ, అత‌ని ప‌రిస్థితి ఇత‌ర ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌ని వాదించారు. దీంతో చేసేదేమీ లేక చిన్నారి త‌ల్లిదండ్రులు ప్ర‌యాణం  విర‌మించుకున్నారు. 

అయితే, రాంచీ విమ‌నాశ్ర‌యంలో దివ్యాంగ బాలుడి ప‌ట్ల ఇండిగో ప్ర‌వ‌ర్తించిన తీరును తోటి ప్ర‌యాణికులు సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. చిన్నారిని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది అతడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. మ‌రో ప్ర‌యాణికుడు  అభినందన్ మిశ్రా చేసిన ట్వీట్ ప్రకారం ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతినిధి దివ్యాంగ చిన్నారిని విమానంలోకి అనుమ‌తించ‌లేదు. కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు అభ్యంతరం చెప్పడంతో సదరు ప్రతినిధి వారితో వాగ్వాదానికి దిగారు. ఇది ద‌రుణ‌మైన విష‌యం. ఎయిర్‌పోర్టుకు కారులో ప్రయాణించడానికి పిల్లవాడు అసౌకర్యంగా ఉన్నాడని, బోర్డింగ్ గేట్ వద్దకు రాగానే ఒత్తిడికి లోనయ్యాడని మిశ్రా చెప్పారు. అయితే అతని తల్లిదండ్రులు కాస్త ఆహారం, ప్రేమతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారని పేర్కొన్నాడు. దివ్యాంగ‌ పిల్లవాడు ప్రయాణానికి అనర్హుడని ఇండిగో ప్ర‌తినిధి నివేదించాడు.

తోటి ప్ర‌యాణికుల‌ ప్రకారం.. అదే విమానంలో వైద్యులు ఉన్నారని.. వారు వారికి మద్దతుగా హామీ ఇచ్చారు. అయితే చివరకు ఇండిగో విమానం ముగ్గురిని వదిలి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. కేంద్ర మంత్రి వ‌ర‌కు వెళ్లింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఫైర్ అయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై తానే స్వ‌యంగా ద‌ర్యాప్తు చేస్తాన‌ని వెల్ల‌డించారు.  ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యం వెల్ల‌డించారు. వివ‌క్ష‌తో కూడా ఈ చ‌ర్య‌ల‌ను స‌హించేది లేద‌ని తెలిపారు. ద‌ర్యాప్తు అనంత‌రం స‌ద‌రు సంస్థ‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.  ‘‘ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదు. ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం జరగకూడదు. దీనిపై స్వయంగా నేను దర్యాప్తు చేపడతాను. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం’’ అని ట్వీట్ చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios