డీజీసీఏ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పైస్‌జెట్‌కు చెందిన 90 మంది పైలట్లు బెయింగ్ 737 మ్యాక్స్ విమానాలను నడపరాదని నిషేధం విధించింది. మ్యాక్స్ విమానాలను ఆపరేట్ చేయడానికి వారు సమగ్రమైన శిక్షణ పొందలేదని పేర్కొంది.

న్యూఢిల్లీ: ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) 90 మంది స్పైస్‌జెట్ పైలట్లపై వేటు వేసింది. బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానాలను ఆపరేట్ చేయకుండా నిషేధం విధించింది. ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం తెలుసుకుంటే ఖంగు తినాల్సిందే. నిషేధానికి గురైన ఆ 90 మంది పైలట్లకు ఆ మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆపరేట్ చేయడానికి సరైన శిక్షణ అందలేదని పేర్కొంది. దీంతో చాలా మంది ఖంగుతిన్నారు. సమగ్ర శిక్షణ లేకుండా ఇన్నాళ్లు వాళ్లు పైలట్లుగా మ్యాక్స్ విమానాలను నడిపారా? అనే ఆందోళనలు వస్తున్నాయి.

ప్రస్తుతం తాము మ్యాక్స్ విమానాలను నడపకుండా ఈ పైలట్లపై నిషేధం విధిస్తున్నట్టు డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. వారు విజయవంతంగా శిక్షణ ముగించుకున్న తర్వాత మ్యాక్స్ విమానాలను ఆపరేట్ చేసే అనుమతిని పొందుతారని వివరించారు. అదేవిధంగా ఈ లోపానికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మ్యాక్స్ సిమ్యులేటర్‌పై ఈ పైలట్లు మళ్లీ సరైన మార్గంలో శిక్షణ పొందుతారని వివరించారు.

బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు మన దేశంలో 2019 మార్చి 13వ తేదీన ప్రవేశించాయి. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అడిస్ అబాబా దగ్గర నేల కూలిన మూడు రోజుల తర్వాత ఈ విమానాలను డీజీసీఏ మన దేశానికి తెచ్చింది. ఆ ఘటనలో నలుగురు భారతీయులు సహా 157 మంది దుర్మరణం చెందారు. ఆ తర్వాత ఆ విమానాలపై భారత్‌లో డీజీసీఏ నిషేధం విధించింది. కానీ, గతేడాది ఆగస్టులోనే ఈ నిషేధాన్ని ఎత్తేసింది. అమెరికా సంస్థ బోయింగ్ ఈ మ్యాక్స్ విమానాల్లో అవసరమైన సాఫ్ట్‌వేర్ మార్పులు చేసి లోపాలను సవరించిన తర్వాత డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం ఎత్తివేతలో మ్యాక్స్ విమానం నడపడానికి ఆ సిమ్యులేటర్‌పై సరైన శిక్షణ పొందిన పైలట్లనే నియమించాలనే కండీషన్ ఒకటి పెట్టింది.

స్పైస్‌జెట్ పైలట్లపై డీజీసీఏ ఆంక్షలు విధించిన విషయాన్ని ఆ సంస్థ ధ్రువీకరించింది. 90 తమ పైలట్లను మ్యాక్స్ విమానం నడపకుండా డీజీసీఏ ఆంక్షలు విధించిందని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. మొత్తం స్పైస్‌జెట్‌లో మ్యాక్స్ విమానంపై శిక్షణ పొందిన పైలట్లు 650 మంది పైలట్లు ఉన్నారని, అందులో 90 మంది పైలట్ల ట్రైనింగ్ ప్రొఫైళ్లపై డీజీసీఏ అనుమానం వ్యక్తం చేసింది. అయిత, వారు ఇతర బోయింగ్ విమానాలను నడపడంలో అభ్యంతరం లేదు. 

ఈ ఆంక్షల కారణంగా స్పైస్‌జెట్‌ మ్యాక్స్ సేవల్లో ఎలాంటి అంతరాయం ఏర్పడదని, మరో సుమారు 144 మంది మ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ నడపడానికి అర్హులేనని వివరించారు. 560 మంది పైలట్లు మ్యాక్స్ విమానం నడపగడానికి సిద్ధంగా ఉన్నారని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. మ్యాక్స్ విమానాలు ఉన్న భారత వైమానిక సంస్థ కేవలం స్పైస్‌జెట్ మాత్రమే కావడం గమనార్హం.