తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. భక్తులపై ఏనుగు దాడి చేయడంతో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తిరుపూర్ జిల్లా పల్లడం సమీపంలోని సెంజేరిమలై పురాండం పాళయంలో మధురై వీరన్ ఆలయం ఉంది.

అక్కడ ఉత్సవాలు జరగుతుండటంతో తీర్తం తీసుకువచ్చేందుకు శనివారం రాత్రి 10 మంది భక్తులు పూండి వెల్లియంగిరి ఆండవర్ ఆలయానికి వచ్చారు. ఆదివారం రాత్రి ఆరు గంటల సమయంలో వెల్లియకుడి కొండ దిగువ ప్రాంతంలోని మామరత్తు కండి అటవీ ప్రాంతంలో ప్రవహిస్తున్న నొయ్యల్ నదిలో నీరు తీసుకురావడానికి వెళ్లారు.

ఆ సమయంలో అక్కడ ఒంటరిగా సంచరిస్తున్న ఏనుగు వారిని చూసి వెంబడించింది. దీంతో భయాందోళనలకు గురైన భక్తులు తలో దిక్కుకు పరిగెత్తారు. వీరిలో ముగ్గురు ఏనుగుకు చిక్కారు. వెంటనే ఏనుగు ముగ్గురిపై దాడి చేసింది.. తొండంతో పైకి ఎత్తి విసిరి కొట్టింది.

ఇది చూసిన మిగిలిన వారు కేకలు వేయడంతో ఏనుగు వీరిని వదిలి వారిని తరుముకుంటూ పరిగెత్తింది. దాని బారి నుంచి తప్పించుకుని ముల్లంకాడు చెక్‌పోస్ట్ వద్ద అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో వెంటనే అటవీశాఖ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఒక వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో కొనఊపిరితో ఉన్నారు. దీంతో వీరిని చికిత్స నిమిత్తం కోవైకి తరలించారు. మరణించిన వ్యక్తిని పురాండం పాళయంకు చెందిన ఆరుస్వామిగా గుర్తించారు. ఇతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.