సీరియల్ నటి దివ్యా భట్నాగర్ ఇటీవల కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె చనిపోవడానికి ముందు భర్త కారణంగా ఎన్నో వేధింపులు అనుభవించిందని తాజాగా వెలుగులోకి వచ్చింది. దివ్య భట్నాగర్ స్నేహితురాలు, మరో సీరియల్ నటి దెవోలీనా భట్టాచర్యా ఈ విషయాలను తెలియజేశారు. తన స్నేహితురాలు నరకం అనుభవించిందని.. అందుకు ఆమె భర్త కారణమని ఆరోపించింది.

‘‘ ప్రేమలో విఫలమైన తర్వాత అమ్మాయిలు తప్పులు చేస్తుంటారు. మానసికంగా కుంగుబాటుకు గురై ఎవరు ఆదరిస్తే వారికి దగ్గరౌతుంటారు. దివ్య చాలా అమాయకురాలు. నేను ఆమెను చుట్టుపక్కల పరిస్థితులు వివరించే ప్రయత్నం చేసేదాన్ని. దివ్య ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, వేధింపుల గురించి తెలియజేయడానికి, ఆమె భర్త గురించి తెలియజేయడానికి నేను మీ ముందుకొచ్చా.’

‘‘ నేను నీ గురించే మాట్లాడుతున్నా గగన్ గబ్రూ( దివ్య భర్తను ఉద్దేశించి). దివ్య తల్లి, అన్నయ్య మీ ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నారని  మిమ్మల్ని అడ్డుపెట్టుకొని పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారని నువ్వు అందరికీ చెప్పావు. అసలు నువ్వు ఎవరు..? నీకు సమాజంలో ఎలాంటి గుర్తింపు లేదు. దివ్యతో పరిచయం ఏర్పరుచుకొని.. నీ ప్రేమను అంగీకరించాలని బ్రతిమిలాడావు. కేవలం నీ వల్ల దివ్యకు నాలుగేళ్లు దూరంగా ఉన్నాను. ఆమెతో బంధాలు తెంచుకున్నాను. మాకు పబ్లిసిటీ ఇవ్వడానికి నువ్వెవరు..? ఇప్పుడు నీకు పబ్లిసిటీ నేను ఇస్తున్నా’’ అంటూ దెవోలినా పేర్కొన్నారు.

‘‘ దివ్యను దారుణంగా వేధించినందుకు నువ్వు జైలుకు వెళతావు. నీకు శిక్ష తప్పదు. భార్య చనిపోయింది కదా అని ప్రియురాళ్లతో ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నావు కదా? గగన్ గబ్రూతో సన్నిహితంగా ఉండే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. ఆధారాలతో సహా నువ్వు చేసిన నేరాలను నేను నిరూపిస్తాను. దేవుడు నిన్ను ఎప్పటికీ క్షమించడు’’ అంటూ దెవోలినా మండిపడ్డారు.