కంగనా ఎపిసోడ్ తర్వాత శివసేన ఫైర్‌బ్రాండ్, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి వార్తల్లోకెక్కారు. కొవిడ్‌-19 బారిన పడిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

బయట పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు ఆయనకు తెలిసొచ్చి ఉంటుందని అన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఉద్ధవ్‌ అస్సలు ఇంటి నుంచి బయటకు రావట్లేదంటూ ఇటీవల బీజేపీ విమర్శలు చేసిన నేపథ్యంలో విలేకర్లతో మాట్లాడుతూ రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

బయట పరిస్థితి బాగాలేదని, జాగ్రత్తగా ఉండాలని ఫడ్నవీస్‌కు తాము సూచించామని రౌత్‌ గుర్తుచేశారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలందించాలని సీఎం ఉద్ధవ్‌.. ఆస్పత్రి వర్గాలకు సూచించినట్లు తెలిపారు.

మరోవైపు దసరా వేడుకల గురించి రౌత్‌ను ప్రశ్నించగా.. ఒకవేళ కొవిడ్‌-19 లేకపోయి ఉంటే ఉద్ధవ్‌ దసరా ప్రసంగం వినేందుకు వచ్చే శివ సైనికులతో సెంట్రల్‌ ముంబయిలో ఉన్న శివాజీ పార్క్‌ నిండిపోయి ఉండేదని రౌత్‌ జోస్యం చెప్పారు.

గతేడాది జరిగిన దసరా వేడుకల్లో రాబోయే ఎన్నికల్లో శివసేనకు చెందిన వ్యక్తే సీఎం అవుతారని చెప్పిన విషయాన్ని సంజయ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే, వ్యాక్సిన్‌ అనేది ప్రజలందరికీ అందించాల్సిందేనని, ఈ విషయంలో రాజకీయాలు తగవని హితవు పలికారు.

కాగా శ‌నివారం చేయించుకున్న క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో దేవేంద్ర ఫడ్నవీస్‌కు పాజిటివ్ వ‌చ్చింది. దీంతో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ ఇన్‌చార్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఫ‌డ్న‌వీస్ సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు.

తాను కరోనా బారిన పడిన విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన అంద‌రూ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని, పాజిటివ్ వ‌స్తే ఐసోలేష‌న్‌లో ఉండాలని ఫ‌డ్న‌వీస్ ట్విట్ట‌ర్‌లో కోరారు.