Asianet News TeluguAsianet News Telugu

భారత్ ను విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా.. ఏ శక్తి దేశాన్ని అంతం చేయలేకపోయింది - ప్రధాని మోడీ

భారతదేశాన్ని విచ్చిన్నం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయని, అయినా ఏ శక్తి మన దేశాన్ని అంతం చేయడంలో విజయం సాధించలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భగవాన్ శ్రీ దేవనారాయణ్ ఎప్పుడూ సేవ, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. 

Despite many attempts to break India.. No force can end a nation - PM Modi
Author
First Published Jan 28, 2023, 4:06 PM IST

భారత్ ను విచ్ఛిన్నం చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ ఏ శక్తి కూడా దేశాన్ని అంతం చేయలేకపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాజస్థాన్‌లో నిర్వహించిన భగవాన్ శ్రీ దేవనారాయణ్ జీ 1111వ అవతార మహోత్సవ్ సంస్మరణ కార్యక్రమానికి ప్రధాని హాజరై ప్రసంగించారు. “వేల ఏళ్ల నాటి మ‌న చ‌రిత్ర‌, నాగ‌రిక‌త, సంస్కృతి మనందరికీ గర్వకారణం. ప్ర‌పంచంలోని అనేక నాగ‌రిక‌త‌లు కాలానుగుణంగా అంతం అయ్యాయి. భౌగోళికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, సైద్ధాంతికంగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏ శక్తి కూడా భారతదేశాన్ని అంతం చేయలేకపోయింది.’’ అని అన్నారు.

భారతదేశం కేవలం భూభాగం మాత్రమే కాదని, మన నాగరికత, సంస్కృతి, సామరస్యం, అవకాశాల వ్యక్తీకరణ కూడా అని అన్నారు. అందుకే భారతదేశం తన ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తోందని చెప్పారు. దీని వెనుక ఉన్న అతిపెద్ద ప్రేరణ మన సమాజపు శక్తి అని, దేశంలోని కోట్లాది మంది ప్రజలు అని ఆయన తెలిపినట్టు వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది. 

గత సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం నాడు తాను పంచప్రాన్‌లను అనుసరించాలని అభ్యర్థించానని, ఇది మన సుసంపన్నమైన వారసత్వాన్ని చూసి గర్వపడటం, వలసవాద మనస్తత్వాన్ని తొలగించడం, దేశం పట్ల బాధ్యతను గుర్తుంచుకోవడం అనే లక్ష్యాలతో ఉందని ప్రధాని మోడీ అన్నారు. నేటి భారతదేశం భవ్యమైన భవిష్యత్తుకు పునాదులు వేస్తోందని అన్నారు. 

భగవాన్ శ్రీ దేవనారాయణ్ ఎప్పుడూ సేవ, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఆయన అంకిత భావంతో పని చేశారని, మానవాళికి ఆయన ఎంతో సేవ చేశారని అన్నారు. భగవాన్ దేవనారాయణ్ చూపిన మార్గం 'సబ్కా సాథ్' ద్వారా 'సబ్కా వికాస్' అని, అయితే నేడు దేశం అదే మార్గాన్ని అనుసరిస్తోందని అన్నారు. గత 8-9 సంవత్సరాలుగా దేశం అణగారిన, నిర్లక్ష్యానికి గురైన ప్రతి వర్గానికి సాధికారత కల్పించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. బలహీనమైన వారికి ప్రాధాన్యత అనే మంత్రంతో తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు. 

నేడు ప్రతీ లబ్ధిదారునికి పూర్తి స్థాయిలో రేషన్‌ ఉచితంగా అందజేస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల వైద్య చికిత్సపై ఉన్న ఆందోళనను పరిష్కరించిందని అన్నారు. ఇళ్లు, మరుగుదొడ్లు, గ్యాస్‌ కనెక్షన్‌, విద్యుత్‌ వంటివి పేద వర్గాల ఆందోళనను కూడా పరిష్కరిస్తున్నాయని అన్నారు. బ్యాంకు ద్వారాలు ప్ర‌తీ ఒక్క‌రి కోసం తెరిచి ఉన్నాయ‌ని చెప్పారు.

నీటి విలువ రాజస్థాన్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదని ప్రధాని మోడీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచినా కేవలం 3 కోట్ల కుటుంబాలకు మాత్రమే తమ ఇళ్లలో కుళాయి కనెక్షన్లు అందాయని, 16 కోట్లకు పైగా కుటుంబాలు రోజూ నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు. గత మూడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషితో ఇప్పటివరకు పదకొండు కోట్లకు పైగా కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయని ప్రధాన మంత్రి తెలిపారు. 

వ్యవసాయ పొలాలకు నీటి సరఫరా కోసం దేశంలో జరుగుతున్న సమగ్ర పనులను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహా విష్ణువు అవతారంగా భావించే భగవాన్ దేవనారాయణుడి జన్మస్థలమైన మలసేరి దుంగ్రి గ్రామంలో ప్రధాని హాజరైన ఈ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ గ్రామం భిల్వారా నుండి 60 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios