డిప్యూటీ చైర్మన్ ఎన్నిక: కేసీఆర్, జగన్ ఎటు వైపు..

Deputy chair person election a challenge for BJP
Highlights

 రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక రాజకీయంగా ఎవరు ఎటు వైపు అనే విషయాన్ని తేల్చే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక రాజకీయంగా ఎవరు ఎటు వైపు అనే విషయాన్ని తేల్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు నేతల వైఖరులను బయటపెడుతుందని అంటున్నారు. డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నికలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఎటు వైపు ఉంటారనేది తేలనుంది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని కూడా బయటపెట్టనుంది.

బిజెపికి అనుకూలంగానే కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీ విమర్శిస్తోంది. జగన్ బిజెపితో కుమ్మక్కయ్యారని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. వారిద్దరు బిజెపి అభ్యర్థికి ఓటు వేస్తే తాము చెప్పిందే నిజమైందని జగన్ పై తెలుగుదేశం పార్టీ విమర్శనాస్త్రాల దాడిని పెంచే అవకాశం ఉంది. కేసీఆర్ పై కాంగ్రెసుకు పదునైన అస్త్రం లభిస్తుంది. 

డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నిక అధికార బిజెపికి, ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీకి ప్రతిష్టాత్మకం అవుతోంది. విజయానికి కావాల్సిన ఆధిక్యత రెండు పార్టీలకు కూడా లేదు. ఈ స్థితిలో ప్రాంతీయ పార్టీల మద్దతే కీలకంగా మారింది. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్, వైసిపి, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజెడి మద్దతు కీలకం కానుంది. ఈ మూడు పార్టీలకు కలిపి 17 మంది సభ్యులున్నారు. 

ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్‌ పీజే కురియన్‌ జూలై 2న పదవీ విరమణ చేస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ప్రారంభమవుతున్నాయి. మొదటి రెండు రోజుల్లోనే డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. 

రాజ్యసభలో మొత్తం సీట్లు 245. బిహార్‌ నుంచి ఖాళీ అయిన స్థానం ఇంకా భర్తీ కాలేదు. దాంతో రాజ్యసభ సంఖ్యా బలం 244. డిప్యూటీ చైర్మన్‌ పదవిని గెలుచుకోవడానికి 123 ఓట్లు అవసరమవుతాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలకు 119 ఎంపీల మద్దతు ఉంది. పీడీపీతో పొత్తు తెగిపోయిన తర్వాత బీజేపీకి, దాని మిత్రపక్షాలకు కలిపి 108 ఎంపీల బలం ఉంది. 

ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి వీలవుతుంది. అయితే తటస్థ పాత్రలో ఉన్న బిజూ జనతాదళ్‌, వైసీపీ, టీఆర్‌ఎస్‌ తమ వైఖరిని స్పష్టం చేసే వరకూ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.

loader