చెన్నై: భర్త మరణించి ఏడాది అవుతున్నా  అతడిని మరిచిపోలేక ఓ వివాహిత తన పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ కు చెందిన రంజిత్ కుమార్, రాశి దంపతులకు ఇద్దరు పిల్లలు. రంజిత్ కుమార్ మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నాడు.

అనారోగ్యంతో రంజిత్ కుమార్ గత ఏడాది మరణించాడు. భర్త మరణించిన తర్వాత కూడ రాశి తన ఇద్దరు పిల్లలతో అత్తింట్లోనే నివాసం ఉంటుంది. రెండు రోజుల క్రితం రంజిత్ కుమార్ సంవత్సీకరం జరిగింది. ఆ రోజు నుండి రాశి తీవ్ర మనోవేదనతో ఉందని కుటుంబసభ్యులు చెప్పారు.

సోమవారం నాడు బాత్ రూమ్ లో నిప్పంటించుకొని రాశి ఆత్మహత్య చేసుకొంది. అంతకుముందే ఇద్దరు పిల్లలను హత్య చేసింది.బాత్ రూమ్  నుండి వాసన రావడంతో తలుపులు పగులగొట్టి చూడగా రాశీ సజీవ దహనమై ఉంది. ఆమె బెడ్ రూమ్ లో ఇద్దరు పిల్లలు చనిపోయి ఉన్నారు. 

తన అన్న, వదినలకు రాశి లేఖ రాసింది. తన భర్త సంవత్సరీకం కోసం ఎదురుచూశానని.. ఆ తతంగం పూర్తి కాగానే  ఆత్మహత్య చేసుకొంటున్నట్టుగా ఆమె ఆ లేఖలో పేర్కొంది. తనను క్షమించాలని కోరింది.