న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెసు నేత జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి మింగుడు పడే విధంగా లేవు. నరేంద్ర మోడీని అన్ని వేళలా భూతంలా చూపించలేమని ఆయన అన్నారు. అలా చేయడం ద్వారా మోడీని ఏ మాత్రం ఎదుర్కోలేమని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మోడీ ప్రభుత్వ విధానం పూర్తి వ్యతిరేకంగా ఏమీ లేదని జైరాం రమేష్ అన్ారు. మోడీ ఆర్థిక విధానం గతంతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ రాజకీయాలు, ప్రభుత్వ విధానానికి అతీతంగా ప్రజా సంబంధాలను సృష్టించిన తీరు కూడా భిన్నంగానే ఉందని ఆయన అన్నారు. 

ప్రధాని ఉజ్వల్ యోజన ప్రధానిగా మోడీకి మంచి పేరు తెచ్చి పెట్టిందని ఆయన అన్నారు. 2014-19 మధ్య మోడీ పనితీరు, 2019 ఎన్నికల్లో 37 శాతానికి పైగా ఓట్లతో తిరిగి అధికారంలోకి రాగలగడం వంటివాటిని పరిగణనలోకి తీసుకుని గుర్తించాల్సి ఉంటుదని ఆయన అన్నారు.

ప్రజలకు దగ్గరయ్యే భాషలో మోడీ మాట్లాడుతారని జైరాం రమేష్ న్నారు. ప్రజలు గుర్తించే రీతిలో మోడీ పనితీరు ఉన్నందున ఆయనను ఎదుర్కోవడం కష్టమని అన్నారు. మనమంతా రైతులు కష్టాల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేస్తుంటామని, అయితే రైతుల కష్టాలకూ మోడీకీ ఏ విధమైన సంబంధం లేదని ప్రజలు భావిస్తారని ఆయన అన్నారు.