Asianet News TeluguAsianet News Telugu

నోట్ల రద్దు, జీఎస్టీతో ప్ర‌జ‌లు, చిరు వ్యాపారుల వెన్నువిరిచారు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు

Ujjain: నోట్లరద్దు, జీఎస్టీతో ప్రజలు, చిరు వ్యాపారుల వెన్నువిరిచార‌ని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మహాకాళ్ స్వామిని దర్శించుకున్న తర్వాత ఉజ్జయినిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు.
 

Demonetisation and GST have broken the backs of people and small traders. Rahul Gandhi's criticism of BJP
Author
First Published Nov 30, 2022, 3:55 AM IST

Congress leader Rahul Gandhi: నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి రావడంతో సామాన్య ప్రజల, ముఖ్యంగా చిన్న వ్యాపారుల వెన్నెముక విరిగిందని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ మంగళవారం అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతుండగా ఉజ్జయినిలో మహాకాళ భగవానుడి దర్శనం తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైన ఉజ్జయిని బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 

"డీమోనిటైజేషన్, జీఎస్టీ ప్రజలు, చిరు వ్యాపారుల వెన్నెముక‌ను విరిచింది. చిన్న వ్యాపారాలు కోలుకోకుండా దెబ్బ‌కొట్టాయి. ఇప్పుడు దానిని పునర్నిర్మించాలి.. అంద‌ర్నీ  ఐక్యం చేయాలి.. అప్పుడే ప్రజలకు ఉపాధి కల్పించగలుగుతాము" అని రాహుల్ గాంధీ అన్నారు.  కోవిడ్ -19 లాక్‌డౌన్‌ల సమయంలో ఎక్కువ దూరం నడిచిన కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారులు నిజమైన తపస్వీలు అని పేర్కొన్నారు. 'భారత్ జోడో యాత్రలో పాద‌యాత్ర చేయడం ద్వారా నేను ఎలాంటి తపస్సు చేయలేదు. కోవిడ్-19 లాక్డౌన్ల సమయంలో ఎక్కువ దూరం నడిచిన కార్మికులు, ప్రజల కోసం ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్న రైతులు, చిన్న వ్యాపారులు దేశానికి నిజమైన 'తపస్విలు' అని ఆయన అన్నారు.

 

పెద్ద వ్యాపారుల మాదిరిగా కాకుండా పక్షం రోజులు లేదా గరిష్టంగా ఒకటి లేదా రెండు నెలలకు మించి నగదు లేకుండా నిలదొక్కుకోలేకపోవడంతో జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుతో చిన్న తరహా వ్యాపారుల చేతుల్లో నగదు ప్రవాహం ఆగిపోయిందని రాహుల్ గాంధీ అన్నారు. దురదృష్టవశాత్తు ఆయా వ‌ర్గాల వారు తమ బకాయిలను పొందడం లేదు.. కానీ దేశంలో న‌లుగురైదుగురు పారిశ్రామికవేత్తలు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని ఆయన ఆరోపించారు. హిందూ మతం ప్రకారం తపస్విని పూజించాలి, కానీ దురదృష్టవశాత్తు, కేవలం నలుగురైదుగురు పారిశ్రామికవేత్త‌ల‌ను మాత్ర‌మే ప్రధాని మోడీని ఆరాధిస్తున్నార‌న్నారు. రైతులు పంటల బీమా కోసం కంపెనీలకు చెల్లించేవారని, అయితే ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపరిహారం అవసరమైనప్పుడు వారు ఈ సంస్థల ఫోన్ నంబర్లు, చిరునామాలను ఇంటర్నెట్ లో కూడా పొందలేని ప‌రిస్థితులు ఉన్నాయ‌ని చెప్పారు.

దేశ‌వ్యాప్త భార‌త్ జోడో యాత్రలో చాలా మంది రైతులు ప‌లు ప్రాంతాల్లో పాలుపంచుకున్నార‌నీ, వారు ఎరువుల కొర‌త‌, సంబంధిత నిల్వ‌లు, ఖ‌రీదైన ఎరువుల గురించి ఫిర్యాదు చేశార‌ని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. "చిన్న దుకాణాల యజమానులు, వ్యాపారులు దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పిస్తారు, కానీ వారి శ్రమను గుర్తించలేదు. వారి జేబులో నుండి డబ్బు లాక్కొని 4-5 మంది పారిశ్రామికవేత్తల చేతుల్లోకి ఇస్తున్నారు" అని  కేంద్ర ప్ర‌భుత్వంపై రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు. కూలీలు, రైతులు, చిరు వ్యాపారులు, యువకులు కష్టపడి పనిచేస్తున్నార‌నీ, అయితే వారికి రావాల్సిన బకాయిలు అందడం లేదనీ, ఎందుకంటే వారు ప్రధానమంత్రి నరేంద్రమోదీని పూజించకపోవడమేనని అన్నారు.

"మోడీని పూజించే 4-5 మంది వ్యక్తులు ఉన్నారు.. (ప్రతిఫలంగా) విమానాశ్రయాలు, పోర్టులు, రైల్వేలు, రోడ్లు, విద్యుత్, నీరుతో సహా వారికి కావలసినవన్నీ పొందుతున్నారు, ఎందుకంటే ఆయన వారిని మాత్రమే చూసుకుంటున్నారు" అని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపం స్కామ్‌ను ప్రస్తావిస్తూ ఇలాంటి మోసాలు కష్టపడి చదివిన యువతకు ఉపాధిని దూరం చేశాయని అన్నారు. అలాగే, "మీడియా ప్రజలకు వాస్తవికతను చూపించాలనుకుంది, కాని వారి చేతులు కట్టివేయబడినందున వారు అలా చేయలేకపోతున్నారు. వారి పగ్గాలు మోడీ, ఆయ‌న‌ ఆరాధకులు అయిన 4-5 మంది వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి" అని ఆరోపించారు. భార‌త్ జోడో యాత్ర కాంగ్రెస్ ప్ర‌చార యాత్ర కాద‌నీ, ఇది హిందుస్థాన్, రైతులు, చిన్న తరహా వ్యాపారులు, కార్మికులు, సోదర-సోదరీమణులు, తల్లులు, యువకులు, జర్నలిస్టులు స‌హా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌తినిధిగా కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపారు. ఈ సమావేశంలో ప్రసంగించిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్, నిరుద్యోగం, నేరాలు-మహిళలపై అఘాయిత్యాలు, అవినీతిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios