ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో యమునా నదిలో నీటిమట్టం ఆల్ టైమ్ హైకి చేరుకుంది.
ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో యమునా నదిలో నీటిమట్టం ఆల్ టైమ్ హైకి చేరుకుంది. యమునా నదిలో నీటిమట్టం బుధవారం 207.55 మీటర్లకు చేరడంతో.. 1978లో నమోదైన 207.49 మీటర్ల ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. యమునా నదిలో ప్రమాదకర స్థాయిలో ప్రవాహం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే నగరంలోకి నీరు ప్రవేశిస్తుంది. ఓల్డ్ ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటిమట్టం బుధవారం 207 మీటర్లకు చేరుకోవడంతో ఢిల్లీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
యమునా నదిలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమ్ంలోనే ముందుజాగ్రత్త చర్యగా దేశ రాజధానిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు సెక్షన్ 144 సీఆర్‌పీసీ విధించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ సెక్రటేరియట్‌లో ఈ సమావేశం జరుగుతుందని.. ఇందులో సంబంధిత అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
నది ఉప్పొంగడంతో నీరు ప్రస్తుతం నగరంలోకి రావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాశ్మీర్ గేట్, రింగ్ రోడ్ సమీపంలోని మఠం మార్కెట్‌లోకి నీరు ప్రవేశించింది. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. యమునా నది ఉప్పొంగిన నీరు రింగ్‌రోడ్డులోకి రావడంతో అధికారులు ఇసుక బస్తాలు వేసి నీరు మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఢిల్లీలో యమునా నది ఉద్ధృతి పెరగడంతో వేలాది మంది ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఢిల్లీ నీటి శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాకు తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని.. అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
ఇక, యమునా నదిలో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని.. అది 207.57 మీటర్లకు చేరుకునే అవకాశం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. యమునా నదిలో వరద ప్రవాహంలో స్థిరమైన పెరుగుదల.. ఓల్డ్ పాత ఢిల్లీలో తీవ్ర వరద హెచ్చరికను ప్రేరేపిస్తుంది. ఇక, ఢిల్లీలో గత మూడు రోజులుగా యమునా నది నీటి మట్టం వేగంగా పెరిగింది.
