Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ యాసిడ్ దాడి ఘటన : అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు మహిళా కమిషన్ నోటీసులు..

ఢిల్లీలో మైనర్ బాలిక మీద యాసిడ్ దాడి నేపథ్యంలో... అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. యాసిడ్ అమ్మకాలను సుప్రీంకోర్టు నిషేధించిన సంగతి తెలిసిందే. 

Delhi Womens commission notices to Amazon, Flipkart over Sale Of Acid
Author
First Published Dec 15, 2022, 2:16 PM IST

న్యూఢిల్లీ : ఢిల్లీలో 17 ఏళ్ల పాఠశాల విద్యార్థినిపై యాసిడ్‌ దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనలో దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు  వాడిన యాసిడ్ ను ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశారు. యాసిడ్ అమ్మకంపై సుప్రీంకోర్టు నిషేధం విధించినప్పటికీ, ఆన్‌లైన్‌లో లేదా బయట దుకాణాల్లో యాసిడ్ విరివిగా దొరుకుతుందో ఈ ఘటన తెలుపుతోంది. దీంతో "యాసిడ్ సులభ లభ్యత"పై ఢిల్లీ మహిళా కమిషన్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు నోటీసు పంపింది.

ఢిల్లీలో ఓ 12వ తరగతి విద్యార్థిని బుధవారం నైరుతి ఢిల్లీలోని ద్వారకలో పాఠశాలకు వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. వారిలో ఒకరు ఆమెపై యాసిడ్‌ పోశాడు. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో నమోదయ్యింది. ఈ వీడియోలో దాడి జరగగానే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి, నొప్పితో, బాధతో కేకలు వేస్తూ పరుగెత్తడం కనిపిస్తుంది. సెప్టెంబర్‌లో బాలికతో గొడవపడిన సచిన్ అరోరా (20) ఈ దాడికి ప్లాన్ చేశాడు. అతనికి 19 ఏళ్ల హర్షిత్ అగర్వాల్, 22 ఏళ్ల వీరేందర్ సింగ్ సహాయం చేశారు.

సచిన్, హర్షిత్ పాఠశాల విద్యార్థినిపై యాసిడ్ పోశారు. వీరేందర్ సచిన్ స్కూటర్, మొబైల్ ఫోన్‌ను వేరే ప్రదేశానికి తీసుకెళ్లి తప్పుడు సాక్ష్యం సృష్టించి పోలీసులను తప్పుదారి పట్టించారు. తమ ప్లాన్ ప్రకారం పోలీసులను పక్కదారి పట్టించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసులు ఆ ముగ్గురు నిందితులను 12 గంటల్లో అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో వారు ఆన్‌లైన్‌లో యాసిడ్‌ను ఆర్డర్ చేశారని తేలింది. సచిన్ అరోరా ఫ్లిప్‌కార్ట్ లో యాసిడ్ కొనుగోలు చేశాడని, దీనికి తన ఇ-వాలెట్‌ ను ఉపయోగించి చెల్లింపులు జరిపారని సీనియర్ పోలీసు అధికారి ప్రీత్ హుడా సాంకేతిక ఆధారాలను ఉటంకిస్తూ చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన.. మైనర్ బాలికపై యాసిడ్ దాడి..

యాసిడ్‌ దాడులు పెరగడంతో కౌంటర్‌లో యాసిడ్‌ విక్రయాలపై 2013లో సుప్రీంకోర్టు నిషేధం విధించింది. యాసిడ్ విక్రయించే వారిపై కోర్టు ఆంక్షలు విధించింది. లైసెన్స్ ఉన్న దుకాణదారులు మాత్రమే యాసిడ్‌ను విక్రయించాలి. యాసిడ్ అమ్మకాల కోసం వారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు యాసిడ్ కొనుగోలు చేసే వారి రిజిస్టర్‌ను  తప్పనిసరిగా మెయింటేన్ చేయాలి. యాసిడ్ కొనుగోలు చేసే వారు కూడా ఎందుకు కొంటున్నారో తెలపాలి. తమ ఐడీ ప్రూఫ్ ఇవ్వాలి.

అయితే షాప్‌లో యాసిడ్ కొనడం చిప్స్ బ్యాగ్ కొన్నంత సులభమని మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో ఢిల్లీ మహిళా ప్యానెల్ చీఫ్ స్వాతి మలివాల్ మాట్లాడుతూ యాసిడ్ కొనడం "కూరగాయలు కొన్నంత సులువు" అని అన్నారు. ‘‘కమీషన్ పదే పదే సిఫార్సులు చేసినా, యాసిడ్ రిటైల్ అమ్మకాలను నిషేధించకపోవడం దురదృష్టకరం. యాసిడ్‌ను మార్కెట్‌లలో బహిరంగంగా విక్రయిస్తున్నారు, ఎటువంటి తనిఖీలు లేకుండా చేస్తున్నారు. నిజానికి యాసిడ్‌ కొనడం.. కూరగాయలు కొనుగోలు చేసినంత సులభం. ప్రభుత్వం యాసిడ్ రిటైల్ అమ్మకాలను నిషేధించాలి' అని మలివాల్ ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios