మెట్రో ట్రైన్ దిగుతుండగా.. ఓ మహిళ చీర డోర్ లో ఇరుక్కుపోయింది. వెను వెంటనే మెట్రో రైలు కదిలి ముందకు వెళ్లింది. చీర ఇరుక్కోవడంతో  మహిళను మెట్రో రైలు ప్లాట్ ఫాంపై ఈడ్చుకెళ్లింది. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన గీత(40) అనే మహిళ తన కుమార్తెతో కలిసి మెట్రో రైలు ఎక్కింది. వారు దిగాల్సిన స్టేషన్ రావడంతో మోతీ నగర్ లో దిగి వెళ్తుండగా.. ఆమె చీర డోర్ లో ఇరుక్కుపోయింది. ప్రయాణికులు దిగడంతో మెట్రో డోర్లు క్లోజ్ అయ్యాయి. దీంతో.. ఆమెను చాలా దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్రగాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ విషయాన్ని గీత భర్త జగదీష్ ప్రసాద్ తెలిపారు. తన కుమార్తె జరిగిన విషయాన్ని తనకు చెప్పిందని ఆయన అన్నారు. తన భార్యను రైలు ప్లాట్ ఫాంపై ఈడ్చుకెళ్తున్నప్పుడు ఓ ప్రయాణికుడు మెట్రోని ఆపేందుకు ఎమర్జెన్సీ బటన్ కూడా ప్రెస్ చేశాడని ఆయన తెలిపారు.