న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల షూటర్ షారూక్ ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్పూర్ లో గత నెలలో పోలీసులపైకి, నిరసనకారులపై తుపాకీ గురిపెట్టి బుల్లెట్లు పేలుస్తూ కెమెరా కంటికి చిక్కిన విషయం తెలిసిందే. 

అతన్ని పోలీసులు సంఘటన జరిగిన ఎనిమిది రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీ జిల్లాలో అతన్ని పట్టుకున్నారు. అతని అరెస్టును చూపించేందుకు ఢిల్లీ పోలీసులు మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

సంఘటన జరిగిన తర్వాత షారూక్ కుటుంబ సభ్యులు అదృశ్యమయ్యారు. షారూక్ ఖాన్ ఇంట్లో పలు అనుమానాస్పద వస్తువులు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. పాలిథీన్ కవర్లో పేలుడు పదార్థాలు కూడా కనిపించాయని చెప్పారు 

పోలీసులు షారూక్ ఫోన్ ను ట్రాక్ చేశారు దాంతో అతను ఢిల్లీలోని మౌజ్ పూర్ నుంచి పానీపట్టు వెళ్లినట్లు తేలింది. అప్పటి నుంచి అతను ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతాల్లో గల కైరానా, అమ్రోహా వంటి నగరాల్లో తలదాచుకుంటూ వస్తున్నాడు.

ఉత్తరప్రదేశ్ లోని కైరానా, షామ్లీలతో పాటు పలు నగరాల్లో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ రోజు షారూక్ కానిస్టేబుల్ కు తుపాకీ గురి పెట్టి కాల్చేస్తానని బెదిరించాడు. అయితే, కాల్చేయాల్సిందిగా కానిస్టేబుల్ సవాల్ చేశాడు. అయితే, అతను ధైర్యం చేయలేదు.