దేశ రాజధాని ఢిల్లీ ఆందోళనలు, ఘర్షణలతో అట్టుడికిపోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కొందరు అనుమతిస్తుండగా.. మరికొందరు దానిని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలు ఢిల్లీ లో ఆందోళనలకు పాల్పడ్డారు. వీరి ఆందోళనలు తారాస్థాయికి చేరడంతో దాదాపు 17మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

అయితే... ఈ ఆందోళనలు ఏ స్థాయిలో  ఉన్నాయో తెలియజేసే ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆందోళనలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి కూడా వీటికి బలయ్యాడు. ఓ యువకుడి తలలోకి ఏకంగా డ్రిల్లింగ్ మెషిన్ దిగింది.

Also Read ఢిల్లీలో కొనసాగుతున్న అల్లర్లు.. 13కి చేరిన మృతుల సంఖ్య...

పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఢిల్లీలో చోటుచేసుకున్న సీఏఏ ఘర్షణల్లో వివేక్‌ అనే వ్యక్తి తల్లోకి డ్రిల్లింగ్‌ మెషీన్‌ చొచ్చుకెళ్లింది. అతడు తన దుకాణంలో పనిచేసుకుంటున్న సమయంలో అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయి. ఆందోళనకారుల దాడిలో వివేక్‌ చేతిలో ఉన్న డ్రిల్‌ మెషీన్‌ అతని తల్లోకి దిగింది.

అతనిని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆ యువకుడి తలకు తీసిన ఎక్స్ రే ఫోటోలను తాజాగా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే.. సదరు వ్యక్తి తలలో నుంచి ఒక్క రక్తపు చుక్క కూడా కనిపించకపోవడం గమనార్హం. అయితే.. కొందరు మాత్రం ఇది నిజం కాదు అని వాదిస్తున్నారు. వారి వాదనలు నిజమనిపించేలా.. ఎక్స్ రే రిపోర్టు మీద రెండు తేదీలు కనపడుతున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం వైరల్ గా మారింది.