ఒక్కో ప్రాంతానికి, ఒక్కో కులానికి ఒక్కో సంప్రదాయం ఉంటుంది. ఆ సంప్రదాయం ప్రకారం వివాహాలు జరుగుతుంటాయి.  అందులో భాగంగానే.. కొందరు పెళ్లిళ్లలో తుపాకులు పట్టుకొని కాల్పులు జరుపుతుంటారు. కాగా...అలా కాల్పల్లో పెళ్లి కొడుకు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే... తాజాగా సంప్రదాయంలో భాగంగా గాలిలో కాల్పులు  జరిపినందుకు పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... న్యూఢిల్లీలోని కర్దంపురి ప్రాంతంలో ఈ నెల 7వతేదీన షోయబ్ మాలిక్ అనే యువకుడి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలకు వచ్చిన సల్మాన్ (21), షావాజ్ మాలిక్(18)లు కంట్రీమేడ్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. 

వివాహ వేడుకల్లో కాల్పులు జరపడమే కాకుండా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పెళ్లి వేడుకలో కాల్పుల ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన పోలీసులు ఐపీసీ 336, సెక్షన్ 27 ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన నిందితులిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు కంట్రోమేడ్ తుపాకీ ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ దాచారు అనే విషయమై దర్యాప్తు సాగిస్తున్నారు.