Asianet News TeluguAsianet News Telugu

శ్రద్దా హత్య కేసు: అఫ్తాబ్ అన్ని నీళ్లు ఎందుకోసం వాడాడు.. అధిక నీటి బిల్లు పోలీసులకు ఆధారం కానుందా?

శ్రద్ధా వాకర్‌ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు అన్నికోణాల్లో విచారణ జరుపుతున్నారు.

Delhi Shraddha Murder case Surprisingly High Water Bill raising suspicion
Author
First Published Nov 17, 2022, 4:36 PM IST

శ్రద్ధా వాకర్‌ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు అన్నికోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ కేసు విచారణ జరుపుతున్న అధికారులు.. అఫ్తాబ్ నివాసం ఉంటున్న అద్దె ఇంటికి అధిక వాటర్ బిల్లు రావడంపై దృష్టి సారించారు. నెలకు 20,000 ఉచిత నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ.. అఫ్తాబ్‌‌ ఉంటున్న ఇంటికి రూ. 300 బిల్లు వచ్చింది. దీంతో పోలీసులు అఫ్తాబ్ అంత పెద్ద మొత్తంలో నీటిని ఎందుకు వినియోగించాడనే అంశంపై విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. 

అయితే అఫ్తాబ్ నివాసం ఉంటున్న కాలనీలోని చాలా ఇళ్లకు 20,000 లీటర్లు..  రోజుకు దాదాపు 35 బకెట్లు.. అంటే కుటుంబానికి సరిపోయే దానికంటే ఎక్కువ. దీంతో చాలా మందికి జీరో వాటర్ బిల్లు వస్తుంది. అయితే అఫ్తాబ్ ఇంటికి రూ. 300 వాటర్ బిల్లు ఎలా వచ్చి ఉంటుందని అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక, అఫ్తాబ్-శ్రద్ధా వాకర్‌ జంట మే 14న అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లోకి మారారు. అయితే శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన మే 18 నుంచి అక్కడ అఫ్తాబ్ ఒంటరిగా నివసిస్తున్నట్లు విచారణలో తేలింది.

యువతి శరీర భాగాలను కత్తిరించే సమయంలో వచ్చే శబ్దం బయటకు వినిపించకుండా ఉండేందుకు ట్యాప్‌ను ఆన్ చేసి ఉంచడం, శరీరంలోని రక్తాన్ని కడగడానికి వేడినీరు, ఫ్లాట్‌లోని మరకలను తొలగించడానికి నీటిలో రసాయనాలు కలపడం.. వంటివి చేయడం వల్ల రూ. 300 వాటర్ బిల్లు పెండింగ్లో ఉందని ఈ కేసును విచారణ జరుపుతున్న వర్గాలు భావిస్తున్నాయి. ఇది కూడా విచారణలో ఒక ఆధారంగా మారే అవకాశం ఉంది. 

‘‘ఇంత ఎక్కువ నీటి బిల్లు చాలా ఆశ్చర్యంగా ఉంది’’ అని ఫ్లాట్ యజమాని రోహన్ కుమార్ తండ్రి రాజేంద్ర కుమార్ చెప్పారు. అఫ్తాబ్ ఉంటున్న ఇంటికి నెలకు రూ. 9,000 అద్దె కాగా..  అద్దె ఒప్పందంలో శ్రద్దా, అఫ్తాబ్ ఇద్దరి పేర్లు ఉన్నాయి. అతను ప్రతి నెల 8 నుంచి 10 వ తేదీలో ఆన్‌లైన్‌లో అద్దెను చెల్లిస్తాడు. అందుకే నేను ఫ్లాట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది’’ అని రాజేంద్ర కుమార్ చెప్పారు. 

ఇక, శ్రద్దా వాకర్‌ది మహారాష్ట్రలోని పాల్‌ఘర్ కాగా.. 2018లో ఆమెకు ముంబై మలాడ్‌లోని ఒక ఎంఎన్‌సీ కాల్ సెంటర్‌లో జాబ్ వచ్చింది. అక్కడే ఆమెకు అఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి సహజీవనం చేయడం ప్రారంభించారు. మలాడ్‌లోనే ఒక ఇంటికి వారు అద్దెకు తీసుకున్నారు. అఫ్తాబ్‌తో తన ప్రేమ గురించి శ్రద్ద ఇంట్లో చెప్పగా.. అందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే శ్రద్ద మాత్రం అఫ్తాబ్‌తో తన సంబంధాన్ని కొనసాగించింది. అతడినే పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పింది. దీంతో శ్రద్దను ఆమె కుటుంబం దూరం పెట్టింది. 

అయితే 2020 జనవరిలో శ్రద్ద తల్లి చనిపోవడంతో ఆమెను కడసారి చూసేందుకు ఇంటికి వచ్చింది. ఆ తర్వాత తిరిగి ముంబైకి వెళ్లిపోయింది. అయితే అఫ్తాబ్‌తో శ్రద్దా బంధంలో కొన్ని గొడవలు మొదలయ్యాయి. అయితే ఈ విషయాలను శ్రద్ద.. ఒకటి రెండు సార్లు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పినట్టుగా చెబుతున్నారు. అయితే ఆ తర్వాత శ్రద్దా వాకర్- అఫ్తాబ్‌లు ఢిల్లీకి మకాం మార్చారు. కొన్నిరోజుల పాటు వివిధ ప్రాంతాల్లో నివాసం ఉన్న వీరిద్దరు.. ఈ ఏడాది మే నెలలో ప్రస్తుతం అఫ్తాబ్ ఉన్న ఇంటికి మారారు. 

అయితే ఇంతకాలం శ్రద్దా స్నేహితుల నుంచి ఆమె వివరాలు తెలుసుకుంటున్న కుటుంబ సభ్యులకు.. గత కొన్ని నెలలుగా ఆమె గురించి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో వారు ఆమె ఎక్కడ ఉందో, ఎలా ఉందో తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే లాభం లేకపోవడంతో ఈ నెల 9న పాల్‌ఘర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే శ్రద్దా వాకర్- అఫ్తాబ్ రిలేషన్ గురించి కూడా చెప్పారు. ఈ క్రమంలో అక్కడి పోలీసులు.. ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

దీంతో పోలీసులు అఫ్తాబ్‌ వద్దకు చేరుకున్నారు. అయితే మే నెలలోనే శ్రద్ద తనతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అఫ్తాబ్ కట్టుకథ అల్లాడు. అనంతరం ఆమెతో పలుమార్లు మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని చెప్పుకొచ్చారు. మరోవైపు పోలీసులు అఫ్తాబ్ ఇంట్లో వెతకినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే అఫ్తాబ్‌ను విచారించే సమయంలో అతడు పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో పోలీసులు అఫ్తాబ్‌ను అనుమానించడం మొదలుపెట్టారు. అతను ఏదో దాస్తున్నాడని భావించారు. పోలీసులు అతనిపై కఠినంగా వ్యవహరించినప్పుడు.. శ్రద్దా వాకర్‌ హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. 

శ్రద్దా వాకర్‌ను గొంతు కోసి చంపిన తరువాత అఫ్తాబ్ కత్తిని ఉపయోగించి మృతదేహాన్ని నరికి, తాను కొనుగోలు చేసిన కొత్త ఫ్రిజ్‌లో వాటిని ఉంచి.. సమీపంలోని అడవిలో 18 రోజుల పాటు పడేశాడని పోలీసుల విచారణలో తేలింది. 

ఇప్పటివరకు ఉన్న ఆధారాలు ఏమిటి..?
అఫ్తాబ్ నేరం అంగీకరించినట్టుగా పోలీసులు చెప్పారు. అయితే అతను దానిని సాంకేతికంగా కోర్టులో ఉపసంహరించుకునేందుకు కూడా అవకాశం జరిగింది.శ్రద్దా వాకర్ హత్య జరిగిన ఒక రోజు తర్వాత మే 19న అతను కత్తి,  ఫ్రిజ్‌ని కొనుగోలు చేసినట్లు సాక్ల్యాలు ఉన్నాయి. అడవిలో దొరికిన ఎముకలు, వంటగదిలో రక్తం కనిపించడం, శ్రద్ధ ఖాతా నుండి అఫ్తాబ్ రూ. 54,000  పొందినట్టుగా బ్యాంక్ వివరాలు; ఫోన్ల నుంచి కాల్ రికార్డులు, ఫ్లాట్ నుంచి శ్రద్ధ బ్యాగ్, శ్రద్దా తండ్రి, ఆమె స్నేహితుల ప్రకటనల ఆధారాలుగా ఉన్నాయి. 

అయితే మృతదేహాన్ని నరికిన కత్తి, రంపం ఇంకా లభ్యం కాలేదు. ఆమె శరీరంలోని చాలా భాగాలు ఇప్పటివరకు కనిపించలేదు. హత్య జరిగిన రోజు అఫ్తాబ్, శ్రద్ధ ధరించిన దుస్తులు కూడా కనిపించలేదు. శ్రద్ధా మొబైల్ ఫోన్ జాడ తెలియలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios