Swami Chakrapani Maharaj : ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలి - స్వామి చక్రపాణి మ‌హారాజ్

ఢిల్లీ రాష్ట్రంలోని 40 గ్రామాలకు పేర్లు మార్చాలని గత కొంత కాలంగా బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే తాజాగా ఏకంగా ఢిల్లీ పేరునే మార్చేయాలని స్వామి చక్రపాణి మ‌హారాజ్ అన్నారు. ఢిల్లీకి ‘ఇంద్రప్రస్థ’ గా పేరు పెట్టాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 

Delhi should be renamed 'Indraprastha' - Swami Chakrapani Maharaj

దేశ రాజధాని పేరును ఢిల్లీ నుంచి ఇంద్రప్రస్థంగా మార్చాలని అఖిల భారత హిందూ మహాసభ, సంత్ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. దీనికి సంబంధించి తమ సంస్థ సంతకాల ప్రచారాన్ని ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. 

‘ఢిల్లీ పాత పేరు ఇంద్రప్రస్థం. ఈ నగరానికి కొత్త పేరు ఢిల్లీ. మహాభారతంలో కూడా దీనిని ఇంద్రప్రస్థంగా పేర్కొన్నారు’’ అని స్వామి చక్రపాణి అన్నారు. ‘‘ తోమర్ కాలంలో ఒక రాజు వదులుగా ఉన్న ఇనుప కర్రను ఏర్పాటు చేశాడు. అయితే ప్రజలు దీనిని ‘ధిలి’ (వదులుగా) అని పిలిచేవారు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని ‘దిల్లీ’ అని పిలిచేవారు. ఆ తర్వాత కాలంలో ఇది ‘ఢిల్లీ’గా మారింది.’’ అని ఆయ‌న అన్నారు. 

ఇంద్రప్రస్థం అంటే ఇంద్రుని రాజ్యమని స్వామి చక్రపాణి అన్నారు. ఇక్క‌డ ప్ర‌తీ ఒక్కరూ సంతోషంగా జీవిస్తున్నార‌ని అన్నారు. అయితే ఈ పేరు మార్పు విష‌యంలో ఢిల్లీ సీఎం ఆఫీసు నుంచి ఇంకా ఎలాంటి స్పంద‌నా రాలేదు. కాగా మొగల్ కాలం పేర్ల‌తో ఉన్న ఢిల్లీలోని 40 గ్రామాలకు స్వాతంత్ర స‌మ‌ర‌యోధుల పేర్లు, ప్రఖ్యాత కళాకారులు, అమరవీరుల పేర్లు పెట్టాలని ఆ రాష్ట్ర బీజేపీ యూనిట్ డిమాండ్ చేసింది. ఈ మేర‌కు సీఎం కేజ్రీవాల్ కు లేఖ రాసింది. 

ఈ పేర్ల‌లో మ‌హర్షి వాల్మీకి, లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ, క్రికెటర్ యశ్పాల్ శర్మ, మిల్కా సింగ్ పేర్లను ఆయా గ్రామాలకు నామకరణం చేయాలని ప్రతిపాదించారు. బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఢిల్లీ పోలీసు అధికారి మోహన్ చంద్ శర్మ, కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా  పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో మరణించిన ఢిల్లీ పోలీసు హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్, ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

‘‘ ఇలాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. గ్రామాలకు వాటి పేరు పెట్టాలని మేము ఒక ప్రతిపాదనను పంపుతున్నాము. మొఘల్ శకం పేర్లను మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారు ’’ అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా మీడియాతో ఇటీవ‌ల తెలిపారు. 40 గ్రామాలకు మొఘలులతో సంబంధం ఉన్న పేర్లు ఉన్నాయని, బానిస మనస్తత్వానికి ప్రతీక అని ఆయన అన్నారు. ఈ 40 గ్రామాలకు జియా సరాయ్, జంరూద్‌పూర్, మసూద్‌పూర్, జఫర్‌పూర్ కలాన్, తాజ్‌పూర్, నజఫ్‌గఢ్, నెబ్ సరాయ్ వంటి పేర్లు ఉన్నాయ‌ని అన్నారు. 

ఢిల్లీ ఇకపై సరాయ్ (సత్రం) కాద‌ని, ఇది దేశ జాతీయ రాజధాని అని ఆదేశ్ గుప్తా అన్నారు. యువతతో పాటు ఆయా గ్రామ‌స్తుల‌కు త‌మ గ్రామాల పేర్లు బానిసత్వానికి చిహ్నంగా ఉండ‌టం ఇష్టం లేద‌ని చెప్పారు. బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన కెప్టెన్ విక్రమ్ బాత్రా, బిస్మిల్లా ఖాన్, అష్ఫాఖుల్లా, మోహన్ చంద్ర శర్మ ఎవరో తెలుసుకోవాలని వారు కోరుకుంటున్నారని గుప్తా అన్నారు. స్వాతంత్ర సమరయోధులు, దేశ సరిహద్దులను పరిరక్షించడానికి వారి ప్రాణాలర్పించిన సాయుధ దళాలకు చెందిన వారి పేర్లు, ధైర్యసాహసాలు, క్రీడలు, కళలు, సంగీతం, సంస్కృతి రంగాల్లో దేశానికి కీర్తిప్రతిష్టలు సాధించిన వారి పేర్లతో ఈ 40 గ్రామాల పేర్లను మార్చాలని తాము సీఎం కేజ్రీవాల్ ను కోరుతున్నామ‌ని ఆయ‌న తెలిపారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios