ఢిల్లీలోని ఇండియన్ స్కూల్‌లో బాంబు ఉందంటూ ఒక ఇమెయిల్ వచ్చింది. దీనిపై స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పోలీసులకు సమాచారం అందించాడు.
Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ స్కూల్ కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఢిల్లీలోని ఇండియన్ స్కూల్‌లో బాంబు పెట్టామంటూ ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈమెయిల్ వచ్చినప్పటి నుంచి కలకలం రేగింది.
దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే విద్యార్థులకు పాఠశాల బయటకు పంపించారు. ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు కొనసాగుతున్నాయి. పాఠశాలలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడలేదు.
రెండు రౌండ్ల సెర్చ్ ఆపరేషన్ పూర్తయిందని, మూడో రౌండ్ కొనసాగుతోందని డీసీపీ సౌత్ డీసీపీ చందన్ చౌదరి తెలిపారు. SWAT బృందం కూడా స్పాట్‌లో ఉందని తెలిపారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామనీ, అయితే.. ఫేక్ ఈ మెయిల్ కావొచ్చని పలువురు భావిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాదిక్ నగర్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో బాంబు పెట్టినట్లు ఉదయం 10.49 గంటలకు ఈమెయిల్ వచ్చింది. ముందుజాగ్రత్తగా పాఠశాలను ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు.తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లాలని స్కూల్ నుంచి మెసేజ్ వచ్చిందని తల్లిదండ్రులు తెలిపారు.
గతంలో కూడా బెదిరింపులు
పాఠశాల యాజమాన్యానికి బాంబు బెదిరింపు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నవంబర్‌లో అడ్మిన్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఇలాంటి ఇమెయిల్ వచ్చింది. అయితే విచారణలో అది ఫేక్ ఈమెయిల్ అని తేలింది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో పాటు తమ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని సీనియర్ పోలీసు అధికారి చందన్ చౌదరి తెలిపారు.
బాంబు బెదిరింపు రావడంతో తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది. కొన్ని అనుకోని భద్రతా కారణాల వల్ల, పాఠశాలను ముందుగానే మూసివేయవలసి వచ్చిందనీ, పాఠశాల నుండి తమ పిల్లలను తీసుకెళ్లాలని సందేశం పంపబడింది. పూర్తి విచారణ అనంతరం పాఠశాలను గురువారం పునఃప్రారంభించనున్నారు. ప్రాంగణం నుంచి అందరినీ బయటకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
