మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటాన్న సంగతి అందరికీ తెలిసిందే. కొత్త కొత్త విషయాలపై ఆయన వెంటనే స్పందిస్తుంటారు. అలాగే తాజాగా ఆయన తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. అదిప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

వివరాల్లోకి వెడితే.. హఫీజ్, హబీబర్ అనే ఇద్దరన్నదమ్ములు ఢిల్లీ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ చెత్త ఏరుకునే క్రమంలో అలసట పోవడానికి పాటలు పాడుతూ పనిచేస్తుంటారు. ఈ క్రమంలో వారు ఓ హిందీ పాటను అద్భుతంగా పాడారు. స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు వారు పాటలు పాడుతుండగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

అది కాస్తా ఆనంద్ మహీంద్రా కంటపడటంతో ఆయన యువకుల గాన కౌశలాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. వారి ప్రతిభను చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా ఆ వీడియోను ట్విటర్‌ లో షేర్ చేశారు. అంతటితో ఆగకుండా అన్నదమ్ములిద్దరికీ మంచి మెలోడియస్ వాయిస్ ఉందని అన్నారు. 

ఢిల్లీలోని సంగీత అధ్యాపకులు సాయంత్రం పూట వారికి కొంత సమయం కేటాయించాలని కోరారు. కాగా, ఇప్పటికే ఈ వీడియోను పదివేల మందికి పైగా నెటిజన్లు చూశారు. అన్నదమ్ముల దగ్గర టన్నుల కొద్దీ ప్రతిభ ఉందని, ఇలాంటి వారికి తప్పకుండా సహకారం అందించాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.