న్యూఢిల్లీ: దేశాన్ని ఓ కుదుపు కుదిపిన ఢిల్లీ అల్లర్లకు సంబంధించి అల్లరి మూక పోలీసులపై దాడి చేసిన వీడియో వెలుగు చూసింది. పోలీసు అధికారులను రాళ్లతో కొడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిస్తున్నాయి. 

తలకు తీవ్రమైన గాయం కావడం వల్ల హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ మరణించిన విషయం తెలిసిందే. అతని హత్యకు వీడియోలో కనిపిస్తున్న అల్లరి మూకనే కారణమని భావిస్తున్నారు. ఈ సంఘటనలో డీసీీప షహదర అమిత్ శర్మ, ఎసీపీ గోకుల్ పురి అనుజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

అల్లర్లు విపరీతంగా చెలరేగిన చాంద్ బాగ్ ప్రాంతంలో నిగా విభాగం ఉద్యోగి అంకిత్ శర్మ హత్యకు గురైన విషయం తెలిసిందే. బిజెపి నేత కపిల్ శర్మ వీడియోను షేర్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. "రతన్ లాల్ ను ఎలా చంపారో చూడండి, చుట్టూ రాళ్లతో.. అదే గుంపు డీసీపీ అమిత్ శర్మను చంపపడానికి ప్రయత్నించింది... చాంద్ బాగ్ లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన గుంపు అదే" అని ఆయన వ్యాఖ్యానించారు.

 

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఫిబ్రవరి 24వ తేదీన ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసు అధికారులపై కొంత మంది తిరగబడ్డారు. దాంతో పోలీసులు కొంత మంది గాయపడ్డారు. 

ఢిల్లీ అల్లర్లలో 48 మరణించగా 250 మంది దాకా గాయపడ్డారు. దాదాపు 92 ఇళ్లను, 57 దుకాణాలను, 500 వాహనాలను, 6 గోడౌన్లను, 2 పాఠశాలలను, 4 ఫ్యాక్టరీలను, 4 ప్రార్థనా మందిరాలను అల్లరి మూకలు ధ్వంసం చేశాయి. ఢిల్లీ అల్లర్ల వల్ల దాదాపు 25 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఢిల్లీ ఛేంబర్ ఆఫ్ కామర్స్ అంచనా వేసింది.