మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా వుంది ఇప్పుడు ఢిల్లీ పరిస్ధితి. అసలే కరోనా విజృంభణతో వణికిపోతున్న ఢిల్లీని మరో మహమ్మారి వేధిస్తోంది. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో డెంగీ బారినపడుతున్న రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

రికార్డు  స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. జనవరి 1 నుంచి ఈ నెల 17 వరకు నమోదైన డెంగీ కేసుల సంఖ్య... 2018లో ఇదే సమయంలో నమోదైన కేసులను అధిగమించింది.

గత వారం రోజుల్లో కొత్తగా నలుగురు కొత్తగా డెంగీ బారినపడ్డారు. వీరితో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 13కు పెరిగింది. 2018 మార్చి - ఏప్రిల్ కాలంలో అత్యధికంగా 12 మంది డెంగీ బారినపడ్డారు.

Also Read:భార్యకు కరోనా: స్వీయ నిర్భంధంలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మంది నగరంలో డెంగీకి చికిత్స పొందుతున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.1996 నుంచి ప్రతి సంవత్సరం ఢిల్లీలో జులై-నవంబరు మధ్య డెంగీ కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి.

డెంగీ అనేది వ్యాక్సిన్ లేని వైరల్ వ్యాధి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.  నివాస పరిసరాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని.. ముఖ్యంగా దోమలు వృద్ది చెందకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

ఈ వ్యాధిని కలిగించే దోమలు ముఖ్యంగా పట్టణ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయని, వాటి పరిధి సమశీతోష్ణ ప్రాంతాల వైపు ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు సైతం తెలిపారు. సాయంత్రం పూట ఇంటి తలుపులు , కిటికీలు మూసి ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.