ఓటు హక్కు కలిగినవారు దానిని వినియోగించుకోకపోతే (not voting).. వారి బ్యాంకు ఖాతాల నుంచి ఎన్నికల సంఘం (Election Commission) రూ.350 డెబిట్ చేస్తుందనే వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో (social media) హల్ చల్ చేస్తుంది.
సోషల్ మీడియా (social media) వినియోగం పెరిగిన తర్వాత చాలా రకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే అందులో ఏ వార్తలు నిజమో, ఏవి అబద్దమో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ప్రచారంలోకి వచ్చిన ఓ వార్త ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఇంతకీ అదేమిటంటే.. ఓటు హక్కు కలిగినవారు దానిని వినియోగించుకోకపోతే.. వారి బ్యాంకు ఖాతాల నుంచి ఎన్నికల సంఘం రూ.350 డెబిట్ చేస్తుందనే వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఈ క్రమంలోనే స్పందించిన ఎన్నికల సంఘం (Election Commission).. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాని పుకార్లుగా తేల్చింది. అలాంటిదేమి ఉండదని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత కూడా ఈ వార్త ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు (Delhi Police) కేసు నమోదు చేశారు. విచారణను ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) విభాగానికి అప్పగించారు. నాన్ కన్‌సైన్‌బుల్ నేరం కింద పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి IFSO డీసీపీ కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు’ అని తెలిపారు.
ఇదే అంశంపై పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శుక్రవారం స్పష్టత ఇచ్చారు. ‘ఓటు వేయనందుకు బ్యాంకు ఖాతా నుంచి రూ. 350 కట్ చేయబడతాయి’ అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. చీఫ్ ఎలక్టోరల్ అధికారి కార్యాలయ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘గత కొన్ని రోజులుగా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం అవుతున్న ఈ వార్తలను మేము పరిశోధించాము. ఇది పూర్తిగా నిరాధారమైనది..కల్పితమని తేలింది. ఎన్నికల ఉత్తర్వుల గురించి సరైన, ఖచ్చితమైన సమాచారాన్ని పొందడానికి ప్రజలు అధికారిక వెబ్‌సైట్ ceopunjab.gov.in ను సందర్శించాలి’ అని తెలిపారు.
