Asianet News TeluguAsianet News Telugu

థ్రిల్లర్ సినిమాను తలపించే దర్యాప్తు.. 25 ఏళ్ల కింది మర్డర్ కేసు.. ఒక్క క్లూ లేకున్నా ఛేదించిన పోలీసులు

ఢిల్లీలో 25 ఏళ్ల కింద జరిగిన ఓ మర్డర్ కేసును పోలీసులు చాకచక్యంగా ఒక్క క్లూ లేకున్నా ఛేదించారు. హంతకుడి ఫొటో లేదు, ప్రత్యక్ష సాక్షి లేడు, మరే ఆధారాలు లేవు. కానీ, అద్భుతమైన రీతిలో ఈ డిజిటల్ యుగానికి ముందే జరిగిన కేసును ఛేదించారు. ఇందుకోసం పోలీసులు అండర్ కవర్‌లో వెళ్లారు. ఎల్ఐసీ ఏజెంట్లు మొదలు.. ఫేస్‌బుక్ ట్రాకింగ్ వరకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసి కేసులో పురోగతి సాధించారు.

delhi police solved 25 year old murder case without even a single clue.. probe is like a gripping thriller movie
Author
First Published Sep 18, 2022, 1:30 PM IST

న్యూఢిల్లీ: 25 ఏళ్ల కిందటి మర్డర్ కేసు. ఆ కేసులో ఒక్క క్లూ కూడా లేదు.  అప్పుడే ఈ కేసుపై దర్యాప్తు జరిపి ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేసు మూలన పడింది. కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి అదృశ్యం అయ్యాడు. ఆయన పేరే కాదు.. గుర్తింపునే మార్చుకున్నాడు. ఏరియా మార్చాడు. ఎవరికీ కనిపించకుండా పోయాడు. ఒక కొత్త వ్యక్తిగా జీవిస్తున్నాడు. మరణించిన వ్యక్తి భార్య కూడా కేసుపై భరోసా వదిలిపెట్టింది. తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వదులుకుంది. అలాంటి ఈ కేసును ఢిల్లీ పోలీసులు అద్భుతంగా ఛేదించారు. డిజిటల్ విప్లవానికి ముందు కాలంలో జరిగిన ఈ కేసును అనూహ్యంగా సాల్వ్ చేశారు.

ఢిల్లీ ఉత్తర జిల్లా పోలీసులకు పురాతన కేసులు ఛేదించడంలో నిష్ణాతులు. ఎంతవరకైనా తెగించి, సమయం వెచ్చించి కేసులు ఛేదిస్తుంటారు. వీరి చేయి ఆ కేసుపై పడే వరకు దానిపై ఎవరికీ ఆశలు లేవు. ఆగస్టు 2021న వీరు ఈ కేసును స్వీకరించారు. అప్పటి నుంచి నత్తనడకన దర్యాప్తు సాగింది. కానీ, చివరి దశలో ఎవరూ ఊహించని వేగంతో దర్యాప్తు దూసుకెళ్లింది.

అది 1997లో జరిగిన హత్య. ఢిల్లీలోని తుగ్లఖాబాద్ ఏరియాలో అప్పుడు కిషన్ లాల్ జీవిస్తుండేవాడు. 1997 ఫిబ్రవరిలో ఓ చల్లటి రోజు రాత్రి సమయాన కత్తితో పొడిచి చంపారు. హంతకుడు అదృశ్యం.

కిషన్ లాల్ ఏ పని దొరికితే అది చేసేవాడు. కిషన్ లాల్ హత్య జరిగిన కాలంలో ఆయన భార్య సునీత గర్భిణి.

ఈ ఘటనపై కేసు నమోదైంది. పటియాలా హౌజ్ కోర్టు రామును అనుమానితుడిగా ఎంచింది. కానీ, దినసరి కూలీ చేసుకునే రాము మిస్సింగ్. ఆయనే అదే పరిసరాల్లో లాల్ అనే పేరుతో జీవించాడు.

ఈ కేసు డిజిటల్ యుగానికి ముందు నమోదైంది. దీంతో కేసుకు సంబంధించిన క్లూలు దాదాపు లేవనే చెప్పాలి. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కేసును ఢిల్లీ పోలీసులు ఓపెన్ చేశారు. 25 ఏళ్ల తర్వాత తన భర్త హత్య కేసు గురించి భార్య సునీతకు కాల్ వెళ్లింది. వెంటనే లక్నోకు రావాలని విజ్ఞప్తి వచ్చింది. ఆమె భర్త హంతకుడిగా పోలీసులు భావిస్తున్న ఓ 50 ఏళ్ల వ్యక్తిని పట్టుకున్నారు. కానీ, ఆయనే హంతకుడా? కాదా?, ఆయన ఐడెంటిటీని గుర్తించడానికి సునీతను రావాలని పోలీసులు కోరారు. 24 ఏళ్ల కొడుకుతో వెళ్లిన సునీత.. హంతకుడిని గుర్తించింది. ఆయనే తన భర్త హంతకుడని చెప్పి స్పృహ కోల్పోయింది.

‘ఆ మహిళ తమకు న్యాయం జరుగుతుందనే ఆశే కోల్పోయింది. పోలీసు బృందంపైనా నమ్మకం వదులుకుంది. ఈ పాత కేసు గురించి గతేడాదే ఆమెను అప్రోచ్ అయ్యాం. చాలా కాలం గడిచిందనే బాధ ఆమెలో ఉంటుందని అర్థం చేసుకోవచ్చు’ అని ఉత్తర ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు సాగర్ సింగ్ కల్సి న్యూస్ ఏజెన్సీ పీటీఐతో తెలిపారు.

ఈ కేసును ఛేదించిన నలుగురు పోలీసు బృందంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఒక్క ప్రత్యక్ష సాక్షి లేకున్నా.. క్లూ లేకున్నా.. కనీసం హంతకుడి ఫొటో కూడా లేకున్నా కేసు ఛేదించారని పొగిడారు.

ఏసీపీ (ఆపరేషన్స్) ధర్మేందర్ కుమార్ పర్యవేక్షణలో నలుగురు పోలీసుల బృందం ఈ కేసును టేకప్ చేసింది. ‘ఈ కేసులో ఒక్క బలమైన క్లూ కోసం కొన్ని నెలలుగా వారు ప్రయత్నించారు. ఆ కాలంలో వారు అండర్‌కవర్‌లో ఢిల్లీ, యూపీలో చాలాసార్లు తిరిగారు’ అని డీసీపీ తెలిపారు.

వారు ఎల్ఐసీ ఏజెంట్లుగా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు వెళ్లారు. అక్కడే రాము బంధువు ఒకరు ఉన్నట్టు గుర్తించి ఆయన దగ్గరకు వెళ్లారు. వారికి చెందిన ఓ బంధువు ఎల్‌ఐసీ పాలసీ చేశాడని, ఆయన మరణంతో ఆ డబ్బులు వస్తాయని చెప్పారు. ఇదే ఏజెంట్లుగా రాము బంధువులు ఉన్నట్టుగా తెలిసిన యూపీలోని ఫర్రూఖాబాద్‌లోని ఖాన్‌పూర్ గ్రామానికి చేరుకున్నారు. 

ఆ ఫర్రూఖాబాద్‌లోనే పోలీసులు రాము కొడుకు ఆకాశ్ ఫోన్ నెంబర్ కనుగొనగలిగారు. ఆ పోలీసు నెంబర్‌తో ఫేస్‌బుక్ ఆధారంగా ఆకాశ్ లొకేషన్ ట్రేస్ చేశారు. లక్నోలని కపుర్తలా ఏరియాగా దాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి తన తండ్రి గురించి ఆకాశ్‌తో ఆరా తీశారు.

ఇప్పుడు రాము అశోక్ యాదవ్ అనే పేరుతో లక్నోలోని జానకీపురం ఏరియాలో ఇ రిక్షా నడుపుకుంటూ జీవిస్తున్నాడు. తన తండ్రిని కలిసి చాలా రోజులైందని ఆకాశ్ చెప్పాడు.

ఇక్కడి నుంచి కేసు అనూహ్య వేగంతో ముందుకు సాగింది. తన గురించి ఎవరో ఎంక్వైరీ చేస్తున్నారనే అనుమానం రాముకు వచ్చే అవకాశం ఉన్నదని అండర్ కవర్ పోలీసులు భావించారని డీసీపీ కల్పి తెలిపారు. ఇప్పుడు వారు ఇ రిక్షా కంపెనీ ఏజెంట్లుగా జానకిపురం ఏరియాలో చాలా మంది డ్రైవర్లను కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద కొత్త ఇ రిక్షా కొనుగోలుపై సబ్సిడీ అందిస్తామని వివరించారు. 

ఇలాంటి ఒక ఇంటరాక్షన్‌లోనే ఓ ఇ రిక్షా డ్రైవర్ వారిని అశోక్ యాదవ్(రాము) వద్దకు తీసుకెళ్లారు. రైల్వే స్టేషన్ సమీపంలో నివసిస్తున్న అశోక్ యాదవ్ వద్దకు సెప్టెంబర్ 14న పోలీసులు వెళ్లారు. ఆయనతో మాట్లాడుతూ పాత గతాన్ని ప్రస్తావించారు. కానీ, వాటన్నింటినీ అశోక్ యాదవ్ ఖండించారు. తాను ఎప్పుడూ ఢిల్లీలో జీవించలేదని చెప్పారు. దీంతో రాము ఐడెంటిటీని గుర్తించడానికి ఆయన బంధువులు, హతుడి భార్య సునీతను పోలీసులు సంప్రదించారు.

చివరకు ఆయన రాము అనే గుర్తించారు. ఆ తర్వాత హత్య చేసినట్టు రాము కూడా ఒప్పుకున్నాడు. ఓ కమిటీ (చిట్ ఫండ్ వంటి సిస్టమ్) నుంచి డబ్బులు పొందడానికి 1997 ఫిబ్రవరిలో తాను లాల్‌ను హత్య చేసినట్టు చెప్పాడు. ఫిబ్రవరి 4వ తేదీన తాను పార్టీ ఇచ్చి కిషన్ లాల్‌కు ఫుల్‌గా తాగించానని వివరించాడు. ఆ తర్వాత కత్తితో పొడిచి డబ్బు పట్టుకుని పారిపోయానని చెప్పాడు. ఆ తర్వాత పలు చోట్ల తలదాచుకుని చివరకు లక్నోలో సెటిల్ అయినట్టు రాము చెప్పాడని అధికారులు తెలిపారు.

ఇలా తలదాచుకుంటున్న సమయంలోనే రాము తన ఆధార్ కార్డు సహా అన్ని ఐడీ కార్డులను మార్చుకున్నాడు. ఫేక్ ఐడెంటిటీని అశోక్ యాదవ్‌గా క్రియేట్ చేసుకున్నాడు.

ఇప్పుడు ఈ 25 ఏళ్ల మర్డర్ కేసులో లీగల్ ప్రొసీడింగ్స్‌ను తిమర్‌పుర్ పోలీసు స్టేషన్ చూసుకుంటున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios