Asianet News TeluguAsianet News Telugu

దేశంలోనే అతిపెద్ద కారు దొంగ ఈ ఆటో డ్రైవర్.. 27 ఏళ్లలో 5000 కార్ల చోరీ.. ముగ్గురు భార్యలు

ఢిల్లీలో ఓ గజ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మన దేశంలోనే అతి పెద్ద కార్ల దొంగ అని పోలీసులు వెల్లడించారు. ఆ దొంగ 27 ఏళ్ల కాలంలో 5000కు పైగా కార్లను దొంగిలించాడు. వాటిని నేపాల్, జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు పంపేవాడు. ఆ తర్వాత అక్రమ ఆయుధ సరఫరా చేయడం ప్రారంభించాడు. ఆయనకు ముగ్గురు భార్యలు. ఏడుగుర పిల్లలకు తండ్రి.
 

delhi police arrests indias biggest car thief.. in 27 years he theft 5000 cars
Author
First Published Sep 5, 2022, 10:39 PM IST

న్యూఢిల్లీ: మన దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగ అనిల్ చౌహాన్ అని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఎందుకంటే ఆయన 27 ఏళ్లలో 5000కు పైగా కార్లను దొంగిలించాడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్లను చోరీ చేశాడు. 52 ఏళ్ల అనిల్ చౌహాన్ ఆటో నడుపుకుంటూ ఉండేవాడు. కానీ, ఈ చోరీలతో ఆయన ఢిల్లీ, ముంబయి, ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో అక్రమ సంపాదన కూడబెట్టుకున్నాడు. వీటికితోడు ఆయనకు ముగ్గురు భార్యలు. ఏడుగురు పిల్లలకు తండ్రి.

ముందస్తు సమాచారం మేరకు పోలీసులు ఢిల్లీలోని దేశ్ బంధు గుప్తా రోడ్ ఏరియాలో అనిల్ చౌహాన్‌ను పట్టుకున్నారు. అనిల్ చౌహాన్ మన దేశంలోనే పెద్ద కార్ల దొంగ అని వివరించారు. ఈ దొంగతనాలు చేయడంతోపాటు అనిల్ చౌహాన్ అక్రమ ఆయుధ సరఫరా చేస్తున్నాడు. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని నిషేధిత సంస్థలకు వాటిని సరఫరా చేస్తున్నాడు.

1995లో ఢిల్లీలోని కాన్‌పూర్ ఏరియాలో ఉంటున్నప్పుడు అనిల్ చౌహాన్ ఆటో నడుపుతూ జీవించేవాడు. అప్పుడే కార్ల దొంగతనాలను ప్రారంభించాడు. ఆ కాలంలో మారుతి 800  కార్లు పెద్ద సంఖ్యలో దొంగిలించాడు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కారులను దొంగిలించి వాటిని నేపాల్, జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు పంపించేవాడు. ఈ కార్లను దొంగతనం చేసే సమయంలో కొంత మంది ట్యాక్సీ డ్రైవర్లను కూడా ఆయన హతమార్చినట్టు పోలీసులు వివరించారు. 

ఆయన చివరకు అసోం వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అక్రమ మార్గాల్లో ఆర్జించిన దానితో ఢిల్లీ, ముంబయి, ఈశాన్య రాష్ట్రాల్లో ఆస్తులు పెంచుకున్నాడు. అనిల్ చౌహాన్ పై మనీ లాండరింగ్ కేసు కూడా దర్యాప్తు ఏజెన్సీ రిజిస్టర్ చేసింది.

అనిల్ గతంలోనూ చాలా సార్లు అరెస్టు అయ్యాడు. 2015లో ఓ సారి కాంగ్రెస్ ఎమ్మెల్యేతో అరెస్టు అయ్యాడు. అప్పుడు ఆయన ఐదేళ్లు జైలులోనే గడిపాడు. 2020లో విడుదల అయ్యాడు. ఆయనపై 180 కేసులు ఉన్నాయి.

అనిల్ చౌహాన్‌కు ముగ్గురు భార్యలు ఉన్నారు. ఏడుగురు పిల్లలను కన్నట్టు పోలీసులు తెలిపారు. అసోంలోనూ ఆయన స్థానిక నేతలతో టచ్‌లో ఉన్నాడు. ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా మారాడు. పోలీసులు ఆయన నుంచి ఆరు పిస్టల్‌లు రికవరీ చేసుకున్నారు. ఏడు కార్ట్‌రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios