ఐఆర్‌సీటీసీ కుంభకోణంలో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌‌ దంపతులతో పాటు ఆయన తనయుడు తేజస్వి యాదవ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

ఐఆర్‌సీటీసీ కుంభకోణంలో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌‌ దంపతులతో పాటు ఆయన తనయుడు తేజస్వి యాదవ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాలూ కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పూరి, రాంచీలోని రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ల మెయింటినెన్స్‌ను ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించడంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది.

ఈ కుంభకోణంలో లాలూ కుటుంబానికి భారీ మొత్తంలో ముడుపులు అందినట్లు సీబీఐ తన ఛార్జీషీటులో పేర్కొంది. దీనిపై లాలూ కుటుంబం బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంది. దీనిని పరిశీలించిన ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.

రూ.లక్ష వ్యక్తిగత బాండ్ అదే మొత్తం పూచీ కత్తుపై వారికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. బెయిల్ మంజూరుపై తేజస్వి యాదవ్ మాట్లాడుతూ... ఈ కేసులో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని, న్యాయవ్యవస్థ పట్ల తమకు విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు.