ఢిల్లీ మెట్రోలో కొందరు అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతున్న ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వీటిపై నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ మెట్రోలో కొందరు అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతున్న ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వీటిపై నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెట్రో కోచ్‌లో నేలపై కూర్చున్న జంట ముద్దులు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రోలో ఎప్పుడూ ఎలాంటి సీన్లు చూడాల్సి వస్తుందోనని ప్రయాణికులు భయపడిపోతున్నారు. దీంతో ఢిల్లీ మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే స్టేషన్లు, రైళ్లలోపల పెట్రోలింగ్‌ను పటిష్టం చేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ నిర్ణయించింది.
యూనిఫాం ధరించిన భద్రతా సిబ్బంది, సాధారణ దుస్తులతో ఉన్న డీఎంఆర్‌సీ సిబ్బందితో మెట్రో స్టేషన్లలో, రైళ్లలో పెట్రోలింగ్‌ను పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకుంది. అటువంటి సంఘటనలను వెంటనే సమీపంలో అందుబాటులో ఉన్న మెట్రో సిబ్బంది లేదా సీఐఎస్‌ఎఫ్‌కు తెలియజేయాలని.. తద్వారా తగిన చర్యలు తీసుకోవచ్చుని ప్రయాణికులను అభ్యర్థించింది.

ఇలాంటి సంఘటనలను అరికట్టేందుకు స్టేషన్‌లలో, మెట్రో కోచ్‌ల లోపల పెట్రోలింగ్‌ను పటిష్టం చేయాలని డీఎంఆర్‌సీ ఇటీవల ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది. ‘‘ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోల నేపథ్యంలో.. ఢిల్లీ మెట్రో అనేక చర్యలను అమలు చేయడం ద్వారా భద్రత, నిఘాను మెరుగుపరచాలని చూస్తోంది’’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
‘‘యూనిఫాం ధరించిన పోలీసు సిబ్బంది, సాధారణ దుస్తులు ధరించిన (డీఎంఆర్‌సీ) సిబ్బంది ద్వారా రైళ్లలో పెట్రోలింగ్ చేయడం అటువంటి చర్యలో ఒకటి’’ అని తెలిపారు. లైన్ వన్‌లోని కొన్ని పాత రైళ్లలో మినహా అన్ని లైన్లలోని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. కొనసాగుతున్న పునరుద్ధరణ ప్రక్రియలో ఆ కోచ్‌లలో, మెట్రో స్టేషన్‌లలో కూడా సీసీటీవీ కెమెరాలను అమర్చడం జరుగుతుందని చెప్పారు. ‘‘ఇది మహిళలతో సహా ప్రయాణీకులకు బెదిరింపులు, అసౌకర్యాలను అరికట్టడానికి సహాయపడుతుంది’’ అని పేర్కొన్నారు.
