ఢిల్లీ-మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్) ప్రాజెక్టు అమలులో జాప్యంపై సుప్రీంకోర్టు సోమవారం ఢిల్లీ ప్రభుత్వాన్ని విమర్శించింది.

ఢిల్లీ-మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్) ప్రాజెక్టు అమలులో జాప్యంపై సుప్రీంకోర్టు సోమవారం ఢిల్లీ ప్రభుత్వాన్ని విమర్శించింది. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేమని ఢిల్లీ ప్రభుత్వం అసమర్ధతను తెలియజేయడంతో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు విమర్శలు చేసింది. ప్రకటనల కోసం నిధులు కేటాయించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న దర్మాసనం.. సాఫీగా రవాణా సాగించే ప్రాజెక్టుకు ప్రభుత్వం వద్ద నిధులు ఎందుకు లేవని ప్రశ్నించింది.

‘‘మీ దగ్గర ప్రకటనల కోసం డబ్బు ఉంటే.. సాఫీగా రవాణా చేసే ప్రాజెక్ట్ కోసం మీ దగ్గర ఎందుకు డబ్బు లేదు?’’ అని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఆర్‌ఆర్‌టీఎస్‌కు సంబంధించిన ప్రకటనల కోసం చేసిన ఖర్చుల వివరాలను రికార్డులో ఉంచాలని ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Scroll to load tweet…

అయితే ఈ పరిణామాలపై స్పందించి బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జ్ అమిత్ మాల్వియా.. ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందుకు సంబంధించి బార్ అండ్ బెంచ్ నివేదికను ట్విట్టర్‌లో షేర్ చేసిన అమిత్ మాల్వియా.. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిధుల కొరత కారణంగా ఎన్‌సిఆర్ ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేకపోయిందని అన్నారు. కేజ్రీవాల్ గత 5 సంవత్సరాలలో ప్రకటనల కోసం 1,868 కోట్లు ఖర్చు చేశారని.. అంటే నెలకు 31 కోట్లకు పైగా.. రోజుకు సుమారు 1.2 కోట్లు అని అన్నారు. సెల్ఫ్ ప్రమోషన్ కోసం పన్ను చెల్లింపుదారులు డబ్బును వినియోగించినప్పుడు.. అభివృద్ధి పనులకు ఎటువంటి వనరులు ఉండవని కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.